కలం, వెబ్‌డెస్క్: సాధారణంగా మానసిక ప్రశాంతత కోసం నిత్యం దేవుడిని పూజిస్తుంటాం. ఉరుకులు పరుగుల ఆధునిక జీవితంలో ఒత్తిడి, ఆందోళన, భవిష్యత్తు గురించిన భయాలు మనుషులను నిరంతరం వేధిస్తూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనసుకు కాస్త ఉపశమనం, అంతర్గత శక్తి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రతీఒక్కరి ఇంట్లో భగవంతుడిని ఆరాధించేందుకు ఓ పూజా మందిరం (Home Temple) ఉంటుంది. ఇల్లు చిన్నదైనా, పెద్దదైనా సరే ఖచ్చితంగా దేవుడి కోసం ఒక చిన్న స్థానాన్ని కేటాయిస్తారు. ఇక ఆ గదిలో దేవుడి పటాలతోపాటు పూజించడానికి అవసరమైన నూనె, ప్రమిదలు, వత్తులు, కర్పూరం వంటి వస్తువులు తప్పనిసరిగా ఉంటాయి. అయితే, ఇవి మాత్రమే కాకుండా పూజగదిలో కొన్ని వస్తువులు తప్పనిసరిగా ఉండాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. పరిహార శాస్త్రం ప్రకారం ఈ వస్తువులు ఉండటం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వివరిస్తున్నారు. పూజ గదిలో ఉండాల్సిన వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం
నెమలి ఈకలు
పూజగదిలో నెమలి ఈకలు ఉండడం వలన ఆ ఇంటికి నవగ్రహాల అనుగ్రహం కలుగుతుందని సూచిస్తున్నారు జ్యోతిష్యులు. అదే విధంగా నవగ్రహ దోషాలు తొలగిపోతాయని వివరిస్తున్నారు.
ఆవు – దూడ బొమ్మ
చాలా మంది తమ పూజ గదిలో ఆవు బొమ్మ లేదా చిత్రపటం ఉంచుతుంటారు. కేవలం ఆవును మాత్రమే కాకుండా ఆవు దూడ బొమ్మ కలిగిన విగ్రహం లేదా ఫొటో ఉంచితే ఐశ్వర్యం లభిస్తుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు.
చిన్న ఛత్రం
వెండి లేదా రాగి లేదా పంచ లోహాలతో తయారు చేసిన చిన్న గొడుగును పూజ గదిలో ఓ మూలన ఉంచితే మంచిదంటున్నారు. అలాగే గొడుగుతో పాటు చామరం లేదా వింజామ ఉంచినా మంచి ఫలితం లభిస్తుందని వివరిస్తున్నారు. వింజామర అంటే పూజా సమయాలలో ఉపయోగించే ఒక ప్రత్యేకమైన విసనకర్ర.
పసుపు గవ్వలు
చాలా మంది పూజ గదిలో తెల్లటి గవ్వలు ఉంచుతుంటారు. అయితే తెలుపు వాటి బదులు పసుపు గవ్వలు ఉంచితే అద్భుత ఫలితాలు ఉంటాయని సూచిస్తున్నారు. పసుపు గవ్వలు అంటే గవ్వలను వెనక్కి తిప్పినప్పుడు అవి కాస్త పసుపు రంగులో కనిపిస్తాయని చెబుతున్నారు. ఈ గవ్వలు లక్ష్మీ దేవికి చాలా ఇష్టమని, పూజగదిలో ఆరు లేదా తొమ్మిది గవ్వలు ఉంచితే ధనలాభం కలుగుతుందని సూచిస్తున్నారు.
పాదరసం, గంధపు చెక్క
పూజ గదిలో ఉండాల్సిన వస్తువుల్లో ముఖ్యమైనవి గంధపు చెక్క, పాదరసం. పాదరసం సాక్షాత్తూ పరమేశ్వరుడి తేజస్సుకు సంకేతమని అంటున్నారు. అయితే పాదరసాన్ని ఎప్పుడూ విడిగా ఉంచకూడదని, గంధపు చెక్కతో కలిపి ఉంచాలని సూచిస్తున్నారు. ఈ రెండూ కలిపి ఉండటం వల్ల పరమేశ్వరుడు, లక్ష్మీ దేవి అనుగ్రహంతో మంచి జరుగుతుందని వివరిస్తున్నారు.
అక్షింతలు
పసుపు కలిపిన అక్షింతలు పూజ గదిలో ఉంటే చాలా మంచిదని చెబుతున్నారు. ఇవి లక్ష్మీ దేవికి చాలా ఇష్టమని, ఇవి ఉన్న ఇంట్లో అమ్మవారి అనుగ్రహం ఉంటుందని సూచిస్తున్నారు.
పచ్చకర్పూరం
పూజ అనంతరం హారతి ఇవ్వడానికి కర్పూరం ఉపయోగిస్తాం. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి మందిరంలో ఉంటుంది. మామూలు కర్పూరంతో పాటు పూజ గదిలో పచ్చ కర్పూరం కూడా ఉండాలని చెబుతున్నారు. పచ్చ కర్పూరంతో విష్ణువుకు హారతి ఇచ్చినా, పచ్చ కర్పూరం వేసి చేసిన నైవేద్యాలు పెట్టినా విశేషమైన ఫలితాలు లభిస్తాయంటున్నారు. ఈ క్రమంలోనే ఓ డబ్బాలో పచ్చ కర్పూరంతో పాటు తొమ్మిది యాలకులు, 9 లవంగాలు ఉంచాలని చెబుతున్నారు.
తామర గింజలు, ముత్యాల మాల
పూజగదిలో తామర గింజలు, ముత్యాల మాల ఉండటం మంచిదని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. అదే విధంగా వెండి పూలు కూడా దేవుడి మందిరంలో ఉంటే ఐశ్వర్యానికి లోటు ఉండదంటున్నారు.

