కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చలి పంజా (Weather) విసురుతోంది. రోజురోజుకు తగ్గుతున్న ఉష్ణోగ్రతల వేళ వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. చలితో పాటు పొగమంచు ఎక్కువవడంతో ఉదయం బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో పలుచోట్ల ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
రెండు, మూడు రోజుల పాటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని ప్రకటించింది. సాధారం కంటే 3–4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆసిఫాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వరంగల్, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ( Weather ) సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. దీంతో వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.


