కలం డెస్క్: ఐపీఎల్ 2026 వేలం (IPL 2026 Auction) లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ (Mustafizur Rahman) కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రూ.9.20 కోట్లు ఖర్చు చేసింది. కాగా అతడికి అంత ఖర్చు చేయాల్సిన అవసరం ఏంటని భారత మాజీ ప్లేయర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) ప్రశ్నించాడు. ముస్తాఫిజుర్‌కు ప్లేయింగ్ 11లో స్థానం దక్కే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని, మైదానంలోకి దిగని ప్లేయర్‌కు అంత ఖర్చు ఎందుకని ఆకాశ్ అన్నాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆకాశ్.. ముస్తాఫిజుర్ ముమ్మాటికీ ఓవర్ ప్రైజ్‌డ్ ప్లేయర్ అని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే KKR తొలి ఎంపిక విదేశీ పేసర్‌గా మథీషా పతిరానాను రూ.18 కోట్లకు దక్కించుకున్న నేపథ్యంలో, ముస్తాఫిజుర్‌ను బ్యాకప్‌గా మాత్రమే చూడాల్సి వస్తుందని చోప్రా పేర్కొన్నారు. అయితే అతడు హైక్వాలిటీ బౌలర్ అయినప్పటికీ, బ్యాకప్ ప్లేయర్‌కు రూ.9.20 కోట్లు ఎక్కువేనని ఆయన వ్యాఖ్యానించారు.
“డిమాండ్ – సప్లై అంశం కచ్చితంగా ఉంది. కానీ ప్లేయింగ్ ఎలెవన్‌లో కూడా చోటు దక్కని ఒక ఆటగాడికి రూ.9.20 కోట్లు ఇవ్వడం చాలా ఎక్కువ. పతిరానాకు రూ.18 కోట్లు ఇవ్వడం ఓకే, ఎందుకంటే అతడిని ఖచ్చితంగా ఆడిస్తారు. లేదా క్యామరూన్ గ్రీన్‌కు రూ.25.20 కోట్లు ఇచ్చినా సరే, అతడు అన్ని 14 మ్యాచ్‌లు ఆడతాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ (Mustafizur Rahman) అసలు పతిరానాకు బ్యాకప్ మాత్రమే. నిజానికి ఈ వేలంలో అంతకన్నా మంచి బ్యాకప్ దొరకలేదు. అతడు హై క్వాలిటీ ప్లేయరే. కానీ రూ.9.20 కోట్లు అనేది చాలా పెద్ద మొత్తం,” అని ఆయన అన్నాడు. ఐపీఎల్ 2026 వేలంలో మథీషా పతిరానాను కోల్‌కతా నైట్ రైడర్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ (DC), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరిగిన తీవ్ర పోటీలో గెలుచుకుంది. ఆ తర్వాత ముస్తాఫిజుర్ రహ్మాన్ కోసం కూడా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లను మించి బిడ్ వేసి KKR దక్కించుకుంది.
Read Also: శుభ్‌మన్ గిల్‌పై వేటు.. గాయమా ఫామ్ లేకపోవడమా?
Follow Us On: X(Twitter)


