కలం, వెబ్ డెస్క్ : కాలుష్యం (Pollution).. ప్రపంచం ముందు ఉన్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి. పెరుగుతున్న కాలుస్యాన్ని, దాని వల్ల వస్తున్న వాతావరణ మార్పులను ఎలా ఎదుర్కోవాలని ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్నాయి కూడా. ఇండియా రాజధాని ఢిల్లీలో కాలుష్యం భారీగా పెరిగిపోయింది. దీని వల్ల ప్రజలు నానాతిప్పలు పడుతున్నారు. వైద్యులు, ఆరోగ్య నిపుణులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. గాలి కాలుష్యం కేవలం మన ముక్కునే ఇబ్బంది పెట్టదని, అది మెల్లగా ఊపిరితిత్తులు, చర్మం, జుట్టు, రోజువారీ శక్తిపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.
ఈ కాలుష్యం మన చర్మంపై కూడా నెమ్మదిగా ప్రతికూల ప్రభావాలను చూపుతుందని న్యూట్రిషనిస్ట్ సాక్షి లాల్వాని వివరిస్తున్నారు. ఈ కాలుష్యం నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఆమె సింపుల్ విధానం చెప్పారు. కాలుష్యాన్ని మనం పూర్తిగా తప్పించుకోలేం కాబట్టి, దానిలో పనిచేయడాన్ని తగ్గించుకోవాలి. ఒకసారి ప్రభావం మొదలైందంటే దాని నుంచి రికవర్ కావడంపై ఫోకస్ పెట్టాలి.
రోజువారీ రక్షణకు “పొల్యూషన్ ప్రెప్ బ్యాగ్”
కాలుష్యం నుంచి బయటపడటానికి పొల్యూషన్ ప్రెప్ బ్యాగ్ వినియోగం తొలి అడుగని సాక్షి అంటున్నారు. ఆమె ఉపయోగించే పాల్యూషన్ ప్రెప్ బ్యాగ్ (Pollution Prep Bag) చిన్నదే అయినా, అందులోని ప్రతి వస్తువుకూ స్పష్టమైన ఉపయోగం ఉంది. N95 మాస్క్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లే సూక్ష్మ కాలుష్య కణాలను తగ్గిస్తుంది. సన్‌గ్లాసెస్ ధూళి వల్ల కళ్లలో వచ్చే ఎర్రదనం, నీరు కారడం నుంచి రక్షిస్తాయి. నాసల్ సాలైన్ స్ప్రే కాలుష్య కణాలు లోతుగా వెళ్లేలోపే అడ్డుకుంటుంది. ముక్కు అంచులో లైట్‌గా నెయ్యి రాయడం కణాలను పట్టుకుని ఉంచి పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఆవిరి పీల్చడం చాలా మంచిది. ఇది రోజంతా కాలుష్యానికి గురైన శ్వాసనాళాలను శాంతింపజేస్తుంది.
డీటాక్స్ ట్రెండ్స్ కాదు
ట్రెండీ డీటాక్స్‌లను పక్కన పెట్టి, నిజంగా పనిచేసే పోషకాలపై ఆధారపడాలని సాక్షి అంటున్నారు. విటమిన్ C శరీరంలోని యాంటీఆక్సిడెంట్ రక్షణను బలోపేతం చేస్తుంది. NAC కాలుష్య గాలి వల్ల వచ్చే ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను హ్యాండిల్ చేయడంలో శరీరానికి సహాయపడుతుంది. హైడ్రేటింగ్ ఎలక్ట్రోలైట్ మిక్స్ గొంతు పొడిబారడాన్ని తగ్గించి దగ్గు ముదరకుండా చేస్తుంది. తులసి, అతిమధురం(mulethi), అల్లంతో చేసిన హెర్బల్ టీ మందు కాకపోయినా, వాపును మెల్లగా తగ్గించి శ్వాసకు కంఫర్ట్‌ను ఇస్తుంది.
కాలుష్యంలో జుట్టు కేర్ ఇలా
కాలుష్యం తల చర్మానికి అంటుకుని, కాలక్రమేణా జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తుంది. బయటకు వెళ్లేముందు స్వల్పంగా ఆవ నూనె లేదా కొబ్బరి నూనె రాయడం తలచర్మానికి ఒక రక్షణ పొరలా పనిచేస్తుంది. కాటన్ స్కార్ఫ్ లేదా క్యాప్ తలను కప్పుకోవడం నేరుగా కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. లోపల నుంచి జుట్టుకు మద్దతుగా జింక్, ఒమేగా-3 ఫ్యాట్స్, నువ్వులు, ఆక్రోట్లు ఉపయోగపడతాయి. జుట్టును మృదువుగా, అవసరమైనప్పుడే కడగాలి, ఎందుకంటే ఓవర్‌వాషింగ్ వల్ల సహజ నూనెలు పోయి డ్రైనెస్ పెరుగుతుంది.
గ్లో కాదు… ముందు స్కిన్ బారియర్
ఎక్కువ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఉన్నప్పుడు మొటిమలు, ఎర్రదనం, డల్ స్కిన్ కనిపించడం సాధారణం. అందుకే స్కిన్ గ్లోపై కాకుండా స్కిన్ బారియర్ రిపేర్ పైనే దృష్టి పెట్టాలని సాక్షి వివరిస్తున్నారు. స్క్వాలేన్, జోజోబా ఆయిల్ లాంటి నూనెలు చర్మంలోని సహజ నూనెలకు దగ్గరగా ఉండి ఇరిటేషన్ తగ్గిస్తాయి. సన్‌స్క్రీన్ UV కిరణాల నుంచే కాదు, కాలుష్య కణాల నుంచి కూడా చర్మాన్ని రక్షించే షీల్డ్‌లా పనిచేస్తుంది. పూర్తి చేతుల దుస్తులు ధూళి నేరుగా చర్మాన్ని తాకకుండా సహాయపడతాయి. రాత్రి డబుల్ క్లిన్సింగ్ చేయడం రోజంతా రంధ్రాల్లో కూర్చున్న కాలుష్యాన్ని తొలగిస్తుంది.
చిన్న అలవాట్లు… లాంగ్ టర్మ్ రక్షణ
కాలుష్యాన్ని(Pollution) పూర్తిగా తప్పించుకోవడం సాధ్యం కాదు. కానీ రోజువారీ చిన్న అలవాట్లతో దాని ప్రభావాన్ని కంట్రోల్ చేయొచ్చు. బయటకు వెళ్లేటప్పుడు శరీరాన్ని కప్పుకోవడం, ముక్కును కడగడం, కాలుష్యానికి గురైన తర్వాత మళ్లీ హైడ్రేట్ కావడం శరీరం రీసెట్ కావడానికి సహాయపడతాయి. ఇవి చిన్న స్టెప్స్‌లా అనిపించవచ్చు. కానీ రోజూ చేస్తే దీర్ఘకాలిక ఇరిటేషన్‌ను గణనీయంగా తగ్గిస్తాయని సాక్షి అంటున్నారు.
Read Also: బీ అలర్ట్.. పబ్లిక్ ప్లేసుల్లో ఫ్రీ వైఫై వాడుతున్నారా!
Follow Us On : WhatsApp


