కలం, ఖమ్మం బ్యూరో : వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) కొండంత అండగా నిలుస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం శ్రీనగర్ కాలనీలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల (CMRF Cheques) పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 51 మంది లబ్ధిదారులకు రూ. 16,16,500 విలువైన చెక్కులను తుంబూరు దయాకర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.
లబ్ధిదారుల్లో ఖమ్మం రూరల్ మండలానికి చెందిన వారు 30 మంది ఉండగా, ఏదులాపురం మున్సిపాలిటీకి చెందిన వారు 21 మంది ఉన్నారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడమే కాకుండా, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందిస్తూ బాధితుల్లో నూతన భరోసా కల్పిస్తోందని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నిరంతరం ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్నారని, అందులో భాగంగానే క్యాంపు కార్యాలయం వేదికగా బాధితులకు త్వరితగతిన సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని బేబీ స్వర్ణకుమారి, ఆయా ప్రాంతాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

