కలం, వెబ్ డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరుగుతుందని తెలిసినా సమాజానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ మతాల ప్రార్థనాలయాలు, పాఠశాలలు, బస్టాండ్లకు సమీపంలో ఉన్న 717 ప్రభుత్వ రిటైల్ మద్యం దుకాణాలను తక్షణమే మూసేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడు రోజుల్లోనే ఈ నిర్ణయంతో పాలనలో విజయ్ తనదైన ముద్ర వేసుకున్నారు.
పిల్లలు, మహిళలను దృష్టిలో ఉంచుకుని..
తమిళనాడులో మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ నడుస్తుండగా.. వీటిని ‘టాస్మాక్ దుకాణాలు’ అని పిలుస్తారు. ప్రైవేటు వైన్ షాపులు ఉండవు. పిల్లలపై మద్యం ప్రభావం పడకుండా, మహిళలకు మందుబాబుల నుంచి ఇబ్బందులు రాకుండా, రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముప్పు తలెత్తకుండా ఉండేందుకే సీఎం విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రార్థనా మందిరాల సమీపంలో 276 దుకాణాలు, విద్యాసంస్థల సమీపంలో 186 దుకాణాలు, బస్టాండ్ల సమీపంలో 255 దుకాణాలు ఉన్నట్లు సీఎం విజయ్‌కు ఎక్సైజ్ శాఖ నివేదించింది. ఈ దుకాణాలను రెండు వారాల్లోగా పూర్తిగా మూసివేయాలని స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా మొత్త, 4,765 వైన్ షాపులు నడుస్తున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రాష్ట్రాన్ని డ్రగ్స్-ఫ్రీ స్టేట్‌గా మార్చే పనిలో భాగంగా, మొదటి అడుగులో మద్యం దుకాణాల తొలగింపు చేపట్టారు.

