కలం, వెబ్ డెస్క్: తెలంగాణతో ఇందిరాగాంధీ కుటుంబానికి గొప్ప అనుబంధం ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) వ్యాఖ్యానించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయడంలో సోనియా గాంధీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి సీఎం పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేశానికి రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) చేసిన సేవలను స్మరించుకున్నారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ.. మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. 21వ శతాబ్దంలో దేశాన్ని కంప్యూటర్ యుగం వైపు నడిపించి ఒక దశ, దిశ చూపించిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీని అని కొనియాడారు. సాంకేతిక యుగం వైపు దేశ యువతను సన్నద్ధం చేసిన నాయకుడని చెప్పారు. మహాత్మగాంధీ, ఇందిరాగాంధీ లాంటి మహానాయకుల స్ఫూర్తితో పనిచేస్తూ రాజీవ్ గాంధీ దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించారని అన్నారు.
పరిపాలనలో మహిళలను భాగస్వామ్యం చేసినప్పుడే దేశం పురోభివృద్ధి సాధిస్తుందని భావించి స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించారని పేర్కొన్నారు. లోక్‌సభ, శాసనసభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి చిక్కుముడులు లేకుండా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మరోసారి బిల్లును ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీని సీఎం కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

