కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ (Telangana) లోని కోటి మందికి పైగా ఉన్న కార్మిక లోకానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల సవరణ ప్రక్రియను పూర్తి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సరైన వేతనాలు లభించకపోవడం వల్ల ఇప్పటివరకు దాదాపు 1.11 కోట్ల మంది కార్మికులు నష్టపోయారని ప్రభుత్వం గుర్తించింది.
ఈ సమస్య పరిష్కారానికి డిప్యూటీ సీఎం, మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ తదితరులతో కూడిన మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సబ్ కమిటీ కార్మిక సంఘాలు, పారిశ్రామికవేత్తల సంఘాలతో విపులంగా చర్చలు జరిపి నివేదికను సిద్ధం చేసింది. కార్మికుల హక్కులు, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సరికొత్త వేతన విధానాన్ని రూపొందించారు. ఈ కొత్త విధానంలో భాగంగా జీవన ప్రమాణాలు, ఖర్చులను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాలను మూడు జోన్లుగా విభజించారు. మున్సిపల్ కార్పొరేషన్లను జోన్ 1 గా, మున్సిపాలిటీలను జోన్ 2 గా, పంచాయతీలు, గ్రామీణ ప్రాంతాలను జోన్ 3 గా వర్గీకరించారు. ఖర్చులు ఎక్కువగా ఉండే జోన్ 1 పరిధిలో కార్మికుల నైపుణ్యాన్ని బట్టి నాలుగు కేటగిరీలలో వేతనాలను భారీగా పెంచారు.
సవరించిన వివరాల ప్రకారం.. అన్ స్కిల్డ్ కార్మికుల వేతనం 12,500 రూపాయల నుండి 16,500 రూపాయలకు పెరిగింది. సెమీ స్కిల్డ్ వేతనాన్ని 13,597 రూపాయల నుండి 17,000 రూపాయలకు పెంచారు. స్కిల్డ్ కార్మికుల జీతం 13,775 రూపాయల నుండి 18,500 రూపాయలకు చేరింది. హైలీ స్కిల్డ్ వర్కర్ల కనీస వేతనాన్ని 14,607 రూపాయల నుండి ఏకంగా 20,000 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రులతో విస్తృతంగా చర్చించిన అనంతరం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం జూన్ 1 నుండి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది.

