కలం, వెబ్ డెస్క్: తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగ నియామకాలపై సుప్రీం కోర్టు (Supreme Court) గురువారం వెలువరించిన తీర్పుపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు స్పందించారు. నియామకాల్లో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ కొందరు అభ్యర్థులు సుప్రీం కోర్ట్‌ను ఆశ్రయించారు. మళ్లీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గతంలో దీనిపై హైకోర్ట్‌ను ఆశ్రయిస్తే తమ వాదనలు పరిగణలోకి తీసుకోకుండా నియామకాలు చేపట్టొచ్చని తీర్పు ఇచ్చిందని వెల్లడించారు. కేసును పరిశీలించిన సుప్రీం కోర్ట్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని, పిటిషన్లను డిస్మిస్ చేసింది.
ఈ నేపథ్యంలో గ్రూప్ -1 నియామకాల విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎక్స్ వేదికగా సీఎం ఓ పోస్టు చేశారు. ఈ తీర్పు ఉద్యోగ నియామకాల పట్ల తెలంగాణ ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి గుర్తింపుగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. కొలువుల కోసం సంవత్సరాల పాటు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసి, కన్నవారి కష్టంపై ఆధారపడలేక, కొలువు వస్తుందో రాదో అన్న దిగులుతో పదేళ్లు కాలం వెళ్లదీసిన గ్రూప్-1 ఆశావహులకు ఇది భారీ ఊరట కల్పించే విషయమని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించి నెలల వ్యవధిలో నియామక పత్రాలు అందజేసినట్లు వెల్లడించారు.
ఈ నియామకాలను అడ్డుకోవాలనుకున్న దుష్ట శక్తుల కుట్రలను కుతంత్రాలను ఛేదించి, రాష్ట్ర పునర్ నిర్మాణంలో తొలి గ్రూప్-1 అధికారులుగా యువతను భాగస్వాములను చేశామని తెలిపారు. నియామక పత్రాలు అందుకున్న వారందరికీ అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ ఆలోచనలు, సంకల్పానికి అనుగుణంగా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి, నిరుద్యోగ యువతకు వ్యవస్థ పట్ల విశ్వాసం కలిగేలా చేశామన్నారు. టీజీపీఎస్సీ ఛైర్మన్, ఉద్యోగులు, సిబ్బంది అత్యంత పారదర్శకంగా ఈ నియామకాలను పూర్తి చేశారని చెప్తూ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

