కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ నెల 20న సర్పంచ్‌లతో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఇప్పటికే జరిగిన పంచాయతీ ఎన్నికల తొలి, రెండో విడతల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు భారీ సంఖ్యలో గెలుపొందడంతో, ఆ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లతో ప్రత్యేకంగా సమావేశం కావాలని సీఎం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మద్దతులో గెలిచిన సర్పంచ్‌లు ఎంతమంది అన్న వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో తమ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌ల జాబితాలతో కలిసి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవనున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలకు స్పష్టమైన సూచనలు వెళ్లినట్టు తెలిసింది.
తొలి విడత, రెండో విడతల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల గెలుపు సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉండగా, నేడు సాయంత్రం మూడో విడత ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. మూడో విడత ఫలితాలు వెలువడిన అనంతరం మొత్తం మద్దతుదారుల సంఖ్యపై సమగ్ర అంచనాకు రావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో, మూడు విడతల ఫలితాల సమీక్ష అనంతరం కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించే అవకాశం ఉందా? అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. సీఎం సమావేశంలో స్థానిక సంస్థల బలోపేతం, గ్రామస్థాయి సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తొలివిడతో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2426 స్థానాలను గెలచుకున్నది. రెండో విడతలోనూ 2331 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతు దారులు విజయం సాధించారు. మూడో విడతలోనూ భారీగా తమ మద్దతుదారులను గెలిపించుకొనేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీల మద్దతు పొంది గెలుపొందిన అభ్యర్థులు సైతం కాంగ్రెస్ గూటికి చేరుకొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భారీ సభ నిర్వహించి గెలుపొందిన సర్పంచ్‌లతో బలప్రదర్శన చేయబోతున్నది.
Read Also: నేడు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు
Follow Us On: Sharechat


