కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని విస్తారమైన అటవీ ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో కలప స్మగ్లింగ్ వ్యవహారాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా దాదాపు 60.95 శాతం (సుమారు 4,311 చదరపు కిలోమీటర్ల) భౌగోళిక విస్తీర్ణంలో అడవులు ఉన్న ఈ జిల్లాలో, అక్రమ నరికివేతలు, స్మగ్లింగ్ కారణంగా దట్టమైన అటవీ విస్తీర్ణం తగ్గుముఖం పడుతోంది. ఐఎస్ఎఫ్ఆర్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కోల్పోతున్న జిల్లాల్లో అదిలాబాద్ తరవాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెండవ స్థానంలో ఉంది. అధికారుల నిఘా ఉన్నప్పటికీ సరిహద్దు ప్రాంతాల అనుకూలతను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు కలపను సరిహద్దులు దాటించేందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు.
సోమవారం యానంబైల్ వైల్డ్‌లైఫ్ రేంజ్ పరిధిలో అటవీ శాఖ అధికారులు పక్కా సమాచారంతో పెద్ద ఎత్తున జరుగుతున్న కలప అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఉల్వనూర్ నుంచి పాల్వంచ వైపు వెళ్తున్న ఒక మహీంద్రా బొలెరో వాహనంలో అత్యంత విలువైన ‘బిల్లుడు’ దుంగలను తరలిస్తున్నట్లు వైల్డ్‌లైఫ్ రేంజర్ కవిత మాధురికి సమాచారం అందింది. ఆమె వెంటనే బేస్ వాచర్లు, సిబ్బందిని అప్రమత్తం చేసి మార్గమధ్యంలోనే వాహనాన్ని అడ్డగించి తనిఖీ చేశారు. దాచి ఉంచిన బిల్లుడు దుంగలను గుర్తించి కలపతో పాటు వాహనాన్ని సీజ్ చేశారు.
ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న ముఠాలపై ప్రస్తుతం దర్యాప్తు వేగవంతం చేశారు. అదే విధంగా ఈ నెల 24 న అశ్వరావుపేట మండలం లంకాలపల్లి, రామన్నగూడెం ప్లాంటేషన్లలో మారుజాతి కలప తరలింపు అనుమతుల మాటున నిబంధనలకు విరుద్ధంగా చింత చెట్లను రాత్రికి రాత్రే నరికివేశారు. ఆ కలపను ముక్కలుగా కోసి ఆంధ్రప్రదేశ్‌లోని జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, ఏలూరు ప్రాంతాలకు లారీల్లో తరలించేందుకు సిద్ధం చేశారు. క్షేత్రస్థాయి అధికారుల పర్యవేక్షణ లోపంపై అసంతృప్తి వ్యక్తం చేసిన స్థానిక గ్రామీణులు నేరుగా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది.
స్పందించిన అధికారులు తనిఖీలు చేపట్టి కలప లోడుతో ఉన్న లారీని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై టీజీఎఫ్డీసీ డీఎం చంద్రమోహన్ స్పందిస్తూ… స్మగ్లర్లు నరికినవి కేవలం నాలుగు చింత చెట్లేనని, మిగిలినవి ఎండిపోయి డొల్లగా మారడం వల్లే ‘మారుజాతి’ కింద నరికారంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకుగాను డీపీఎంకు షోకాజ్ నోటీసు ఇచ్చామని, బాధ్యుడైన వాచర్‌ను విధి నిర్వహణ నుంచి తొలిగించామని వెల్లడించారు.
జిల్లాలో వరుసగా వెలుగుచూస్తున్న ఈ సంఘటనలు అటవీ పరిరక్షణలో క్షేత్రస్థాయి పర్యవేక్షణ అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. అధికారుల నిఘాతో పాటు, స్థానిక ప్రజలు కూడా అనుమానాస్పద కదలికలపై సమాచారం అందించినప్పుడే అటవీ సంపద అక్రమ రవాణాకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టడం సాధ్యమవుతుందనీ అధికారులు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

