కలం, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన నీట్ (NEET) యూజీ పరీక్షా విధానంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. నీట్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని వ్యాఖ్యానించింది. పరీక్షా పత్రాల లీకేజీ, భారీ అవకతవకల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయడంతో, విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో పడ్డారని పేర్కొన్నది. ఈ పరిణామం విద్యార్థుల భవిష్యత్తును ‘డీమానిటైజ్’ చేయడమేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. నీట్ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ప్రస్తావిస్తూ.. వ్యవస్థాత్మక వైఫల్యాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయని గుర్తుచేశారు. నీట్ యూజీ పరీక్ష రద్దుతో దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది విద్యార్థుల అకడమిక్ ఫ్యూచర్ అగమ్యగోచరమైందన్నారు.
సమగ్రమైన విచారణకు సీఎం రేవంత్ డిమాండ్ :
నీట్ (NEET) అండర్ గ్రాడ్యుయేట్ పరీక్ష రద్దు తదనంతరం ఏర్పడిన సంక్షోభంపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం, విద్యార్థుల పక్షాన నిలబడుతూ సమగ్రమైన విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పలు డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏ తక్షణమే సమగ్రమైన, సమయబద్ధమైన విచారణకు ఆదేశించాలన్నారు. లీకేజీ వెనుక ఉన్న వ్యక్తులు ఎంతటి వారైనా, ఎంతటి ప్రభావశీలురైనా ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించాలన్నారు. సిస్టమ్‌లో ఉన్న లోపాల వల్ల అమాయక విద్యార్థులు పదేపదే నష్టపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
మెరిట్ కంటే అనిశ్చితి ఎక్కువగా ఉన్నదా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులు ఏళ్ల తరబడి ఎంతో ఆర్థిక భారం, మానసిక ఒత్తిడిని భరిస్తూ ఈ పరీక్షలకు సిద్ధమవుతారని, కానీ, ఇలాంటి ఘటనలు వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు. పోటీ పరీక్షలు ఎప్పుడైనా ప్రతిభకు నిదర్శనంగా ఉండాలే తప్ప ఆందోళనలకు కేంద్రాలుగా మారకూడదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్న అంశాన్ని గుర్తుచేశారు. తెలంగాణ విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన సాంకేతిక రక్షణ, సంస్థాగత జవాబుదారీతనం ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
Read Also: ఏఐ ఎఫెక్ట్.. ఆ దేశంలో లేదు.. ఉద్యోగులకు నో టెన్షన్
Follow Us On: Instagram

