కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పదేళ్ల పాలన వందేళ్ల విధ్వంసానికి దారి తీసింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ, నాణ్యమైన విద్య అందించాలన్న ఆశయంతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. రెండేళ్లల్లో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని ఇందులో ఎక్కువ శాతం దళితులు, గిరిజనులకు కేటాయించామని సీఎం చెప్పారు. తాము నిరంతరం పనిచేస్తుంటే.. వెనక నుంచి కొందరు కుట్రలు చేసి, గోతులు తవ్వుతున్నారు అని ధ్వజమెత్తారు. గోతులు తవ్వే వారిని ఆ గోతిలోనే పాతిపెట్టే పని చేయాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. గత పదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని సరిచేస్తూ ముందుకు వెళుతున్నామన్నారు. గత పదేళ్లలో పెద్ద పెద్ద ప్రసంగాలు చేసిన నాయకులు ఒక్కసారైనా అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారా? అని ప్రశ్నించారు. ప్రజా పాలనను, ప్రజా స్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
డీలిమిటేషన్ పై బీజేపీ కుట్రలు..
నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) విషయంలో బీజేపీ కుట్రలు చేస్తోంది అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్ర చేస్తున్నారన్నారు. 50 శాతం ప్రాతిపదికన పెంచుతామని చెప్పి దక్షిణాది రాష్ట్రాల సీట్ల కోటా తగ్గించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చిన్న లెక్క కేంద్ర మంత్రులుగా ఉన్నవాళ్ళకి తెలియడం లేదా? అని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రో రేటా ప్రకారం సీట్ల పెంపు కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
Read Also: చీరలో డాన్స్ చేస్తే తప్పా..? యువతి కన్నీరు !
Follow Us On: Instagram

