కలం, వెబ్‌డెస్క్: జోనల్ కమిషనర్లు ప్రతిరోజూ ఫీల్డ్ ఉండాల్సిందేనని, అందరూ కలసి పనిచేస్తేనే నగరం బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఈ మేరకు కొత్త జోనల్ కమిషనర్లతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాన్ని ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేసుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్–2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేశామని, దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పరిపాలన సౌలభ్యం కోసమే నగరాన్ని పునర్వ్యవస్థీకరించినట్లు చెప్పారు. అందులో భాగంగానే ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE) గా మార్చినట్లు తెలిపారు. క్యూర్ పరిధిలోని సిటీని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా విభజించినట్లు వివరించారు.
చెత్త నిర్వహణ అత్యంత సంక్లిష్టమైన సమస్య:
నగరంలో అత్యంత సంక్లిష్టమైన సమస్య చెత్త నిర్వహణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందువల్ల కోర్ అర్బన్ రీజియన్‌ను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. జోన్ల వారీగా సంబంధిత సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత జోనల్ కమిషనర్లదేనని, అందువల్ల జోనల్ కమిషనర్లు ప్రతీరోజు ఫీల్డ్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. సిటీలో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. నగరంలో కాలుష్య నియంత్రణకు అవసరమైన పూర్తిస్థాయి ప్రక్షాళన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా క్యూర్ పరిధిలో డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఈవీ వెహికిల్స్ (Electric Vehicles) తీసుకురావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
‘ప్రతీ పది రోజులకోసారి గార్బేజ్ క్లియరెన్స్ డ్రైవ్ నిర్వహించాలి. నెలకు మూడు రోజులు శానిటేషన్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి. చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ఏరియాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. రోడ్లపై ఎక్కడా చెత్త, గుంతలు కనిపించడానికి వీల్లేదు. అలాగే హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ విభాగాలు జనవరి నుంచి నాలాల పూడిక తీత పనులు మొదలుపెట్టాలి. దోమల నివారణ, అంటువ్యాధులు ప్రబలకుండా కచ్చితమైన చర్యలు తీసుకోవాలి. చెరువులు, నాలాలను ఆక్రమణల నుంచి కాపాడుకోవాలి. నగరంలో వీధి దీపాలు సరిపడా ఉండేలా చూసుకోవాలి’ అని సీఎం(Revanth Reddy) అధికారులను ఆదేశించారు.
గుడ్ గవర్నెన్స్ నుంచి స్మార్ట్ గవర్నెన్స్‌కు మారాలి:
పాలనలో టెక్నాలజీని సమర్థంగా ఉపయోగించుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ‘ప్రజలకు పారదర్శక సేవలు అందించాలి. జనన మరణ ధ్రువీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సులు, ఇతర ధ్రువ పత్రాల జారీకి సాంకేతికతను వాడాలి. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్, అపార్ట్మెంట్ అసోసియేషన్లతో కమ్యూనికేషన్ ఉండేలా చూసుకోవాలి. ఎక్కడ సమస్య తలెత్తినా పరిష్కరించేందుకు టోల్ ఫ్రీ నంబర్‌కు వీలయినంత వేగంగా స్పందించాలి. క్యూర్ ఏరియాలో అన్ని విభాగాల అధికారులను సమన్వయం చేసే బాధ్యత స్పెషల్ సీఎస్ చూసుకుంటారు. వచ్చే ఐదేళ్లకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలి. అందరూ కలిసి పనిచేస్తేనే నగరం భవిష్యత్ బాగుంటుంది’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోనల్ కమిషనర్లకు దిశానిర్దేశం చేశారు.
Read Also: టోల్ ఫ్రీకి అనుమతి ఇవ్వండి: కేంద్రానికి కోమటిరెడ్డి లేఖ
Follow Us On: Instagram


