Mobile Popup Ad
Mobile Popup Ad

సంక్షేమ–అభివృద్ధి పనులలో వేగం పెంచాలి: మంత్రి శ్రీధర్ బాబు

కలం,పెద్దపల్లి: సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల (Welfare Programmes) అమలులో మరింత వేగం పెంచాలని, అధికారులు బాధ్యత, పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శనివారం పెద్దపల్లి(Peddapalli) సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తదితరులతో కలిసి జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, పౌర సరఫరాలు, ఇరిగేషన్, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, ఇందిరమ్మ ఇండ్లు, విద్య, వైద్యం, రెవెన్యూ, పరిశ్రమలు, వీబీజీ రామ్‌జీ, విద్యుత్, తాగునీటి సరఫరా, అటవీ తదితర శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పురోగతిని వివరించారు.

 ప్రజాపాలనపై శ్వేతపత్రం సిద్ధం చేయాలి

ప్రస్తుత ప్రభుత్వానికి ఇంకా రెండున్నరేళ్లకు పైగా పదవీకాలం ఉందని, ఈ సమయంలో ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరేలా అధికారులు మరింత నిబద్ధతతో పనిచేయాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రజలకు సమయం కేటాయించి వారి సమస్యలను ఓపికగా వినాలని, దరఖాస్తుల పరిష్కారంలో పారదర్శకత పాటించాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై జిల్లా స్థాయిలో సమగ్ర శ్వేతపత్రం సిద్ధం చేసి, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సూచనల ఆధారంగా లోపాలను గుర్తించి వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు.

యూరియా బుకింగ్ యాప్ రాష్ట్రానికి ఆదర్శం

పెద్దపల్లి జిల్లాలో ప్రారంభించిన యూరియా బుకింగ్ యాప్ రాష్ట్రానికే కాకుండా దేశానికీ ఆదర్శంగా నిలిచిందని మంత్రి ప్రశంసించారు. ప్రతి రైతుకు అవసరమైన సమయంలో యూరియా అందేలా చూడాలని, అనవసర వినియోగాన్ని నియంత్రించాలని అధికారులకు సూచించారు. సూపర్ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులను ఆయిల్ పామ్, కూరగాయలు, పప్పుధాన్యాల వంటి ప్రత్యామ్నాయ పంటల సాగువైపు ప్రోత్సహించాలని చెప్పారు. ప్రభుత్వం బోనస్ ప్రకటించిన ఏడు రకాల వరి వంగడాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.

 రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, సన్న రకాల వరి సాగు చేసిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ వల్ల గతంలో రైతుబంధు ద్వారా వచ్చిన లబ్ధికంటే ఎక్కువ ఆదాయం లభించిందని అన్నారు. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న ఏడు రకాల వరి వంగడాలను ప్రభుత్వం ముందుగానే గుర్తించి బోనస్ ప్రకటించిందని, రైతులు వాటినే సాగు చేసి అధిక లాభాలు పొందాలని సూచించారు. గతంలో ధాన్యం అమ్మిన రైతులకు చెల్లింపులు ఆలస్యమయ్యేవని, ప్రస్తుతం 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, యూరియా యాప్ అమలుతో గత యాసంగిలో జిల్లాలో యూరియా వినియోగం 19 శాతం తగ్గిందని అన్నారు. ఇప్పటివరకు 21,126 మంది రైతులకు 2,453 మెట్రిక్ టన్నుల యూరియాను యాప్ ద్వారా పంపిణీ చేశామని తెలిపారు.గత యాసంగిలో 65,129 మంది రైతుల నుంచి 4.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.1,057 కోట్లను రైతుల ఖాతాలలో జమ చేసినట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్ల తొలి విడతలో 6,276 ఇళ్లను మంజూరు చేయగా, 1,909 గృహప్రవేశాలు పూర్తయ్యాయని, రూ.130.24 కోట్లను లబ్ధిదారుల ఖాతాలలో  జమ చేసినట్లు చెప్పారు. రెండో విడత అర్హుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు.

వైద్య రంగంలో జిల్లా ఆసుపత్రి సేవలు మెరుగుపడగా, మంథని 50 పడకల ఆసుపత్రి, రామగుండం మెడికల్ కళాశాల హాస్టల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్‌ఆర్‌ఎస్‌ ఆధారిత హాజరు విధానం విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. అమృత్–2.0, టీయూఎఫ్‌ఐడీసీ వంటి పథకాల ద్వారా త్రాగునీరు, సీసీ రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు, మార్కెట్లు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. సమీక్ష సమావేశానికి ముందు మంత్రులు తెలంగాణ ఉద్యమ అమరవీరుడు దొడ్డి కొమురయ్య, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చిత్రపటాలకు నివాళులర్పించి, “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో నూతన అంబులెన్స్‌ను ప్రారంభించారు. సమావేశంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>