కలం, వెబ్ డెస్క్: గత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తప్పులు, అప్పులు తెలంగాణ ప్రజలకు ఉరితాళ్లుగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. ప్రధాని మోడీని పదే పదే కలుస్తానని తన మీద కొందరు విమర్శలు చేస్తుంటారని.. కానీ తాను తెలంగాణ ప్రజల కోసమే మోడీని కలుస్తుంటానని తనకు ప్రధానితో బంధుత్వం ఏమీ లేదని పేర్కొన్నారు. శుక్రవారం నిర్మల్‌లో నిర్వహించిన బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధానికి ఉన్న మోడీ విమనాశ్రయానికి అనుమతి ఇవ్వాలని ఉందని చెప్పారు.
నాకు పర్సనల్ ఎజెండా లేదు
తనకు పర్సనల్ ఎజెండా లేదని.. పైరవీలు అవసరం లేదని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు తనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారని.. వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తన మీద ఉందని చెప్పారు. ఎవరిని కలిసినా రాష్ట్రం గురించే అడుగుతున్నానని చెప్పారు. బీజేపీ ఎంపీలు తన చుట్టే ఉంటారని.. మంత్రులు కూడా తన చుట్టే ఉంటారని.. వారి సమక్షంలోనే అన్నీ అడుగుతున్నానని చెప్పారు. కేంద్రాన్ని అడగకపోతే నిధులు రావని చెప్పారు.
పదేండ్లు తీవ్ర నిర్లక్ష్యం
పదేండ్లు గత ప్రభుత్వం అడగలేదని.. సమస్యలను పరిష్కరించలేదని చెప్పుకొచ్చారు. మన సమస్యను కేంద్రం దగ్గర నివేదించడం ద్వారా పరిష్కారమవుతుందని చెప్పారు. కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు మంజూరు చేయించుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. పదేండ్లు వారు ఆలోచన చేయకపోవడం వల్లనే రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. ఇప్పుడు రాష్ట్రం మీద 8 లక్షల కోట్ల అప్పుల భారం ఉందని చెప్పారు. గత పాలకులు చేసిన అప్పులు తీర్చుకుంటూ తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు.
ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
‘అప్పటి పాలకులు చేసిన తప్పులు, అప్పులు ఇప్పుడు ఉరితాడై ప్రజలకు చుట్టుకున్నది. ఒక్కొక్కదాన్ని పరిష్కరించుకుంటున్నాం. ఆదిలాబాద్ జిల్లా పోరాటాల గడ్డ. జల్ జంగల్ జమీన్ పోరాటం ఇక్కడే మొదలైంది. రాంజీగోండు, కొమురం బీం మన కోసం కొట్లాడి త్యాగం చేశారు. ఆదిలాబాద్ ప్రాజెక్టులు పదేండ్లలో పూర్తి కాలేదు. ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టాం. యూనివర్శిటీని మంజూరు చేస్తున్నాం. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను మంజూరు చేస్తున్నాం తుమ్మిడిహట్టి కట్టి తీరుతాం. ప్రజల నీటి కష్టాలను తీరుస్తాం.. జిల్లాను సశ్యశ్యామలం చేస్తాం. జిల్లాకు విమానాశ్రయం తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది.’ అంటూ ముఖ్యమంత్రి పేర్కొన్నారు.


