కలం, వెబ్ డెస్క్ : ఏపీలో సంక్రాంతి జోష్ మామూలుగా లేదు. కోనసీమతో పాటు ఈ సారి గుంటూరు, నెల్లూరు లాంటి జిల్లాల్లోనూ కోడి పందేలు (Cock Fight) జోరుగా సాగుతున్నాయి. అయితే ఓడిన కోళ్లకు అనూహ్యంగా ఇప్పుడు డిమాండ్ పెరిగిపోయింది. పందెం కోడి కూర రుచిగా ఉంటుందని.. పైగా పందెం కోడిని కూరను టేస్ట్ చేయాలనే కోరికలతో వీటిని కొనేందుకు ఎగబడుతున్నారు. పందెం కోళ్లకు కొన్ని నెలల పాటు జీడిపప్పులు, డ్రై ఫ్రూట్స్, బలమైన ఆహారం పెడుతారు. వ్యాయామాలు చేయించి బలిష్టంగా తయారు చేస్తారు.
అలాంటి కోడి మాంసం రుచి వేరే లెవల్లో ఉంటుందని చెబుతున్నారు పందెం రాయుళ్లు. దీంతో ఓడి పోయిన కోడిని.. ఒక్కో దానికి రూ.10వేల నుంచి రూ.15వేల దాకా పెట్టి మరీ కొనేస్తున్నారు జనాలు. మామూలుగా పందెం కోళ్లు బతికున్నప్పుడు లక్షల్లో పలుకుతుంటాయి. కానీ పందెంలో ఓడిపోయి చనిపోయిన కోళ్లకు లక్షల్లో పెట్టేందుకు ఎవరూ ముందుకు రారు. అందుకే ఇలా వేలం వేసేసి అమ్మేస్తున్నారు. పందెంలో (Cock Fight )గెలిచిన వ్యక్తులు ఓడిన కోళ్లను తీసుకుని వండుకుని తినేయడం ఆనవాయితీ. కానీ ఓడిన కోళ్లకు కూడా డిమాండ్ భారీగా ఉండటంతో.. గెలిచిన వాళ్లు వాటిని ఇలా వేలం వేసి లాభార్జనగా మార్చుకుంటున్నారు.


