కలం, వెబ్ డెస్క్: కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాల (MPPS Girls Gandhari) పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న బొంపెల్లి భవాని (Teacher Bompelly Bhavani) జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆమెకు ట్విట్టర్ వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుల ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకునే గొప్ప గౌరవం ఆమెకు దక్కనుందని ప్రశంసించారు.
దేశవ్యాప్తంగా 48 మంది ఉపాధ్యాయులు ఈ అవార్డుకు ఎంపికయ్యారని, వారిలో భవాని కూడా ఒకరని అన్నారు. తెలంగాణ నుంచి ఈ అవార్డుకు ఎంపికైన ఏకైక ఉపాధ్యాయురాలు భవాని అని, ఆమె ఇటీవల ఫిన్‌లాండ్‌లో నిర్వహించిన స్టడీ టూర్‌కు తెలంగాణ నుంచి వెళ్లిన ఉపాధ్యాయుల బృందంలో కూడా ఉన్నారని గుర్తుచేశారు. గత దశాబ్దకాలంగా ఆమె విద్యార్థులు, పాఠశాల అభివృద్ధిపై చూపిన ప్రభావం విశేషమైనదని కొనియాడారు.
అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో బాలికల చేరికలను మూడు రెట్లకు పైగా పెంచడంతో పాటు, పాఠశాలలో సౌకర్యాలు, మౌలిక వసతుల మెరుగుదలకు కూడా కృషిచేసిందన్నారు. ఈ కృషి ఆమెను సమాజానికి ఆదర్శంగా నిలిపిందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులే నిజమైన, అత్యంత గొప్ప దేశ నిర్మాతలని సీఎం కొనియాడారు. ఉపాధ్యాయురాలు భవాని ఈ అద్భుతమైన విజయానికి మనమందరం కలిసి అభినందనలు తెలియజేద్దాం అని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

