రాజీనామా చేయాల్సిందే.. ఆయనపై తీవ్ర ఒత్తిడి!

కలం, వెబ్ డెస్క్: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా (Manan Kumar Mishra) రాజీనామా చేయాలంటూ అన్ని వైపులా ఆయనపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా బార్ కౌన్సిల్ కో–ఛైర్మన్ వై.ఆర్.సదాశివ రెడ్డి సైతం ఆయన దిగిపోవాల్సిందేనని లేఖ రాయడం సంచలనంగా మారింది. మిశ్రా రూ.150 కోట్ల నిధులు దారి మళ్లించినట్లు ఆరోపణలు వస్తున్నాయని.. వెంటనే విచారణ జరగాలన్నారు. తన కుటుంబ సభ్యులకు నిబంధనలకు విరుద్ధంగా పదవులు ఇప్పించుకున్నారని.. వారిని సైతం గుర్తించి తొలగించాలని సదాశివ రెడ్డి డిమాండ్ చేశారు. బార్ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు.

సుప్రీం కోర్టులో పిటిషన్..

మనన్ కుమార్ మిశ్రాకు మరో షాక్ తగిలింది. ఆయన గత పదేళ్లుగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా కొనసాగుతున్నారని, వెంటనే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై వెంటనే విచారణ జరిపించాలని కోరారు. ఈ పిటిషన్ త్వరలోనే విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, మిశ్రా వెంటనే రాజీనామా చేయాలని ‘క్యాంపెయిన్ ఫర్ జ్యుడీషియల్ అకౌంట్‌బులిటీ అండ్ రీఫార్మ్స్’ సంస్థ డిమాండ్ చేస్తూ మూడు పేజీల లేఖ విడుదల చేసింది.

నల్సార్ విద్యార్థులతో మొదలు..

హైదరాబాద్ నల్సార్ విద్యార్థులను బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకోకుండా మనన్ కుమార్ మిశ్రా జారీ చేసిన ఉత్తర్వులతో రగడ మొదలైంది. దీనిపై దేశ వ్యాప్తంగా విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన మిశ్రా.. ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు. అయినా శాంతించని విద్యార్థులు.. ఆయన రాజీనామాకు డిమాండ్ చేశారు. వారికి కాక్రోచ్ జనతా పార్టీ, పలువురు న్యాయవాదులు, అడ్వకేట్ల సంఘాలు కూడా జత కావడంతో మిశ్రా మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడు ఏకంగా కౌన్సిల్‌లో పనిచేస్తున్న తోటి సభ్యులే ఆయన తప్పుకోవాలని డిమాండ్ చేసే పరిస్థితి రావడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>