కలం, వెబ్ డెస్క్: ఆర్టీసీకి (TGSRTC) అన్ని రకాలుగా అండగా ఉండే బాధ్యత తనదే అని, ఉత్తమ పనితీరుతో సంస్థను బలోపేతమయ్యేలా చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సూచించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో 14 ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో సమావేశమై.. అనేక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ ఠాగూర్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
‘దేశంలోనే ఆర్టీసీ గొప్ప సంస్థ..’
ఆర్టీసీ దేశంలోనే గొప్ప సంస్థ అని, కార్మికులు పట్టుదలతో పనిచేయడం వల్లనే ఈ స్థాయిలో ఉందని సీఎం రేవంత్ ప్రశంసించారు. ‘నేను వేరు, మీరు వేరు అన్న భావన నాకు ఎప్పుడు లేదు. అందరం కలిస్తేనే ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆర్టీసీ కార్మికులు కోరుకున్నారు. వారి పోరాటాల్లో మేమంతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బస్సులు, నియామకాలు, ఆదాయాన్ని పెంచాం. గాజులరామారంలో బస్ టర్మినల్ కోసం 100 ఎకరాలు కేటాయించాం. శంషాబాద్‌లో 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి బస్ టర్మినల్ నిర్మించబోతున్నాం.1000 ఈవీ బస్సులు కొనుగోలు చేసి మెట్రోతో అనుసంధానం చేస్తున్నాం.మినీ బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అందించాలనుకుంటున్నాం. ఈ సారి ఉద్యోగులకు రూ.1000 కోట్ల బకాయిలు విడుదల చేశాం. సంస్థప అప్పుల భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాఆం’ అని సీఎం వివరించారు.
‘ఖర్చు తగ్గాలి.. ఆదాయం పెరగాలి..’
ఆర్టీసీ ఆదాయం పెరగాలంటే ఖర్చు తగ్గించుకోవాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. ‘డీజీల్ కోసమే సంస్థ ఏటా రూ.2000 కోట్లు ఖర్చు చేస్తోంది. అందుకే ఈవీ బస్సులను తీసుకురావాలని సూచిస్తున్నాం. ఆర్టీసీలో బకాయిలు మా హయాంలో పెట్టినవి కాకపోయినా.. వాటిని ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆర్టీసీ సమస్యలు నా దృష్టికి వస్తే వెంటనే పరిష్కరించా. యూనియన్లు, విలీనం లాంటి అంశాలపై కార్మిక సంఘాలే చర్చించుకోవాలి. పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ముందు ఆప్షన్స్ పెట్టాలి’ అని సంఘాల నేతలకు సూచించారు.
‘ఒక్క డ్రైవర్‌ను కూడా తీసేయం..’
ఆర్టీసీలో ఒక్క డ్రైవర్ ను కూడా తగ్గించబోమని సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. ‘మహాలక్ష్మి పథకం ద్వారా రూ.8 వేల కోట్లు అందించాం. కార్మికులు, డిపో మేనేజర్ల మధ్య గ్యాప్ రాకుండా అధికారులు చూడాలి. సంఘాలు రాజకీయాల ప్రభావానికి లోనైతే సంస్థకు నష్టం జరుగుతుంది. సంస్థ ఆగిపోతే ఊపిరిపోయినట్లే.. సంస్థకు నష్టం జరిగే పనులు చేయొద్దు. ఆర్టీసీ కార్మికుల హక్కులను కాపాడుతాం’ అని హామీ ఇచ్చారు.
వేతనాలు చెల్లిస్తాం.. కేసులు ఎత్తివేయిస్తాం
ఆర్టీసీ సంఘాల నేతలతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి రెండు కీలకల హామీలు ప్రకటించారు. కార్మికుల 3 రోజుల సమ్మె వేతనం అందించడం, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామని తెలిపారు. ఈ మేరకు రెండు అంశాలపై చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అధికారులను ఆదేశించారు.
Read Also: ఇండియా లో పెరుగుతున్న డింక్ కల్చర్..!
Follow Us On : WhatsApp

