కలం, వెబ్ డెస్క్ : గోదావరి పుష్కరాలు (మహా పుష్కరాలు) 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు జరగనున్నాయి. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అత్యంత పవిత్రమైన పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రధాన ఆలయాలు , పుష్కర ఘాట్ల అభివృద్ధి ప్రణాళికలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. 2027 జూన్ లో గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాల్సిన పనులపై అధికారులతో సమీక్షించారు. పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి రూపొందించిన ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు టెక్నికల్ ఇంజనీర్ల కమిటీని నియమించాలని అధికారులను ఆదేశించారు. ఈ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటించి 15 లేదా 20 రోజుల్లోగా నివేదికను అధికారుల కమిటీకి అందజేయాలన్నారు. ఇంజనీర్ల కమిటీ నివేదికను అధికారుల కమిటీ పరిశీలించి, పూర్తి అంచనాలతో నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి పంపాలని తెలిపిన సీఎం.. కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తరువాత ప్రణాళికలకు సంబంధించిన నివేదికపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. శాశ్వత, తాత్కాలిక పనులను ప్రాధాన్యతల వారీగా పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు.
అటు వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం తలెత్తకుండా ప్రజా భవన్ లో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా ప్రధాన దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ఘాట్ల విస్తరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోడ్లు, వివిధ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి, ఆలయ విస్తరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. సదరు మాస్టర్ ప్లాన్ పై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు.

