కలం, వెబ్ డెస్క్: తమిళనాడులోని ‘ఆది కుంభేశ్వరాలయం’ (Adi Kumbeswarar Temple) ఒక్కసారి దర్శించుకుంటే శత్రు భయాలు ఉండవని భక్తులు విశ్వసిస్తారు. సాక్షాత్తూ శ్రీరాముడే ఇక్కడి స్వామిని పూజించి రావణ సంహారం చేశారని నమ్ముతూ ఉంటారు. దీని ప్రకారం ఈ క్షేత్రం ఎంతటి శక్తివంతమైనదో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడులోని కుంభకోణం నడిబొడ్డున, కావేరీ, అరసలార్ నదుల మధ్య వెలసిన ఈ అద్భుత క్షేత్రం భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతోంది. ఇక్కడ పరమేశ్వరుడు కుంభేశ్వరలింగంగా, అమ్మవారు మంగళాంబికాదేవిగా కొలువై ఉన్నారు. పార్వతీదేవి 51 శక్తి పీఠాల్లో ఇది ఒకటి కావడం విశేషం.
పురాణాల ప్రకారం, సీతాపహరణం తర్వాత తీవ్ర దుఃఖంలో ఉన్న శ్రీరాముడు ఈ క్షేత్రాన్ని సందర్శించారు. ఇక్కడి కుంభేశ్వరుడిని భక్తితో ఆరాధించిన తర్వాతే ఆయనకు శత్రువులపై విజయం సాధించే శక్తి లభించిందని, ఆపైనే లంకకు వెళ్లి రావణసంహారం చేశారని స్థల పురాణం చెబుతోంది. అందుకే ఇప్పటికీ శత్రువుల బాధలు ఎక్కువగా ఉన్నవారు, కోర్టు కేసులు లేదా ఇతర సమస్యలతో సతమతమయ్యేవారు ఇక్కడి స్వామిని దర్శిస్తే ‘శత్రుజయం’ తథ్యమని భక్తులు బలంగా విశ్వసిస్తారు.
వీడిన బంధాలను కలిపే కుంభేశ్వరుడు
శత్రువులపై విజయమే కాకుండా, మనస్పర్థల కారణంగా విడిపోయిన భార్యాభర్తలు ఈ క్షేత్రాన్ని దర్శించి మంగళాంబికాదేవిని, కుంభేశ్వరుడిని వేడుకుంటే వారి మధ్య వైవాహిక బంధం తిరిగి బలపడుతుందని ప్రతీతి. సతీవియోగ బాధ నుంచి ఉపశమనం పొందడానికి ఈ క్షేత్ర దర్శనం ఒక దివ్యౌషధంలా పనిచేస్తుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు.
ఆలయ (Adi Kumbeswarar Temple) విశేషాలు:
అమృత కుంభం: గరుత్మంతుడు తీసుకెళ్తున్న అమృత భాండం నుంచి చుక్కలు జారి పడగా, శివుడు ఇసుకతో కుండను (కుంభం) చేసి ఆ అమృతాన్ని భద్రపరిచిన చోటు ఇది. ఆ కుండ వంపు తిరగడం (కోణం) వల్లే ఈ ఊరికి కుంభకోణం అని పేరు వచ్చింది.
అభిషేకం లేని లింగం: శివుడు అభిషేక ప్రియుడైనా, ఇక్కడ స్వామికి కేవలం గంధ లేపనం మాత్రమే చేస్తారు. నిత్యాభిషేకాలు ఉండవు.
మహామహం: ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహామహం ఉత్సవం ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతుంది. కుంభకోణం చేరుకోవడానికి అన్ని ప్రధాన నగరాల నుంచి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. శత్రువులపై విజయం, కుటుంబంలో సుఖశాంతుల కోసం భక్తులు నిత్యం ఈ క్షేత్రానికి పోటెత్తుతుంటారు.
Read Also: సంజీవని శకలం పడిన క్షేత్రం.. చాల్కాపూర్ హనుమాన్ ఆలయం
Follow Us On : WhatsApp

