కలం, వెబ్‌డెస్క్: రెండేళ్లకు ముందు వైసీపీ పాలనలో రాష్ట్రంలో కనీసం నవ్వే పరిస్థితి కూడా లేదని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. కృష్ణా జిల్లాలోని పమిడిముక్కలలో నిర్వహించిన పేదల సేవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 35 మంది భవన నిర్మాణ కార్మికులకు పీ4 పథకంలో భాగంగా రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కులను అందజేశారు. అలాగే ఎన్టీఆర్ కాలనీలో సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. మేడే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో సీఎం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత వైసీపీ పాలనలో ప్రజలతో మాట్లాడే పరిస్థితి లేదని, రాజకీయ నేతలు బయట తిరిగే పరిస్థితి లేదన్నారు. మేడే లాగానే ఏపీ ప్రజలకు మరో స్వాతంత్య్రం తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ కూటమిదేనన్నారు. నాడు పవన్ కల్యాణ్, మోదీ, తాము రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చామని, ఇప్పుడు రెండేళ్లుగా అందు కోసమే పని చేస్తున్నామని స్పష్టం చేశారు. రాత్రింబవళ్లు కష్టపడి ఎక్కడా తప్పు జరుగకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. పేదల కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమలు తీసుకొచ్చిందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.

