కలం, వెబ్ డెస్క్: లోక్‌సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు (Amaravati Bill) ప్రవేశ పెట్టిన సందర్భంగా వైసీపీ తీరుపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీవ్ర విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లా వింజమూరులో పెన్షన్ల పంపిణీ సందర్భంగా జరిగిన ప్రజా వేదిక సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై అసెంబ్లీలో చర్చ పెడితే కనీసం వైసీపీ సభ్యులు పాల్గొనలేదని చంద్రబాబు విమర్శించారు. నేటితో మూడు రాజధానుల పేరుతో వైసీపీ చేసిన మూడు ముక్కలాటకు ముగింపు పలికామన్నారు. చంద్రబాబు తాను 4 సార్లు ముఖ్యమంత్రిగా పని చేశానని, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నానని.. కానీ, జీవితంలో జగన్ లాంటి వ్యక్తిని, ఇలాంటి పార్టీని ఎప్పుడూ చూడలేదని చెప్పారు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని తీవ్ర విధ్వంసం చేసి ఆనందం పొందారన్నారు. ఆగమేఘాలపై అసెంబ్లీ సమావేశం పెట్టి తీర్మానం పెడితే కనీసం చర్చలో పాల్గొనలేదన్నారు. అసలు వైసీపీ రాజకీయ పార్టీ అనే అర్హత లేదని, ఎవరైనా ఆ పార్టీ సభ్యులమని చెప్పుకోవడానికే సిగ్గుపడాలని సీఎం అన్నారు.
వైసీపీ వల్ల రాష్ట్రానికి ఎలాంటి లాభం లేదని సీఎం వ్యాఖ్యానించారు. అమరావతికి చట్టబద్ధత వస్తుందని, రాజధానిని ఇక ఇంచు కూడా ఎవరూ కదిలించలేరన్నారు. అమరావతి ప్రజా రాజధాని అని, ఏపీకి ఏకైక రాజధాని అని సీఎం ప్రకటించారు. ఒక వ్యక్తికి అడ్రస్ ఉండాలని, రాష్ట్రానికి రాజధాని ఉండాలని సీఎం అన్నారు. అలాంటి రాజధానిని ఎగతాలి చేసి ఎడారి అని, స్మశానం అని, ముంపు ప్రాంతం అని వైసీపీ రాజధాని లేకుండా చేసిందని విమర్శించారు.
Read Also: మిడ్ డే మీల్స్‌లో బల్లి.. స్కూల్‌లో పేరెంట్స్ ఆందోళన!
Follow Us On: X(Twitter)

