శ్రీశైలం(Srisailam) భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu) ఫుల్ ఫోకస్ పెట్టారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిగిన దివ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఆలయ సమగ్రాభివృద్ధిపై ఆదివారం ఆయన సమీక్షించారు. దేవాదాయ, అటవీశాఖ అధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Anam Ramanarayana Reddy), ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రతి ఏడాది మల్లికార్జున స్వామి దర్శించుకోవడానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసమే ఆలయ అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
తిరుమల తరహాలోనే శ్రీశైలాన్ని(Srisailam) అభివృద్ధి చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. శ్రీశైలాన్ని ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా, పర్యావరణ పరంగా అభివృద్ధి చేయాలన్నారు సీఎం. దేవాల అభివృద్ధి కోసం రెండు వేల హెక్టార్ల భూమిని దేవాదాయశాఖకు కేటాయించేలా కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ అభివృద్ధిలో భాగంగానే శ్రీశైల క్షేత్రాన్ని జాతీయ రహదారులను అనుసంధానించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ సందర్భంగానే శ్రీశైలంలోని పులుల అభయారణ్యం అభివృద్ధి గురించి చర్చించారు.

