పాకిస్తాన్ కి యుద్ధ విమానాల ఇంజన్లు సరఫరా చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై రష్యా(Russia) స్పందించింది. ఈ వార్తలు అవాస్తవమని క్లారిటీ ఇచ్చింది. పాకిస్తాన్ తో అలాంటి ఒప్పందం జరగలేదని స్పష్టం చెప్పింది. భారత్ కి ఇబ్బంది కలిగించే చర్యలు తాము తీసుకోమని రష్యా ప్రభుత్వ వర్గాలు తేల్చి చెప్పాయి. కాగా, పాకిస్తాన్ లో ఉన్న చైనా తయారీ JF-17 ఫైటర్ జెట్లకు రష్యా RD-93MA ఇంజన్లను సరఫరా చేస్తోందని పలు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.
ఈ కథనాలు భారత్ లో తీవ్ర ఆందోళనకు తెరలేపాయి. ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్(Jairam Ramesh) బీజేపీ ప్రభుత్వాన్ని ఎక్స్ వేదికగా నిలదీశారు. రష్యా భారతదేశానికి అత్యంత విశ్వసనీయ వ్యూహాత్మక మిత్రదేశమని ప్రధాని చెబుతుంటారు. మరి అలాంటి రష్యా ఈ విషయంలో న్యూఢిల్లీ విజ్ఞప్తులను ఎందుకు విస్మరించింది? పాకిస్తాన్‌కు చెందిన చైనా నిర్మిత JF-17 ఫైటర్ జెట్‌ల సముదాయానికి అధునాతన RD-93MA ఇంజిన్‌లను సరఫరా చేయడానికి ఎందుకు ముందుకు వచ్చిందో నరేంద్ర మోడీ(Modi) ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు.
ఇది మోదీ దౌత్య వైఫల్యం అని ఆయన మండిపడ్డారు. ప్రధాని దౌత్యం జాతీయ ప్రయోజనాల కంటే తన ఇమేజ్ బిల్డింగ్ కి, అంతర్జాతీయ ప్రదర్శనలకే పరిమితమైందని ఆరోపించారు. ఈ క్రమంలో పాకిస్తాన్ యుద్ధ విమానాలకు తాము ఎలాంటి ఇంజన్లు సరఫరా చేయడం లేదని, భారత్ కి ఇబ్బంది కలిగించే చర్యలు తీసుకోబోమని రష్యా(Russia) ప్రకటించడంతో ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పడింది.

