కలం, కరీంనగర్ బ్యూరో: మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Collector Chitra Mishra) పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీస్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నార్కోటిక్ కోఆర్డినేషన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ (Chitra Mishra) మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నియంత్రణ సమాజంలోని ప్రతి ఒక్కరి సమిష్టి బాధ్యత అని పేర్కొన్నారు. యువతను మత్తు బారిన పడకుండా కాపాడేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డ్రగ్స్ రహిత జిల్లాగా కరీంనగర్ (Drug Free Karimnagar District)ను తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు
మత్తు పదార్థాల దుష్పరిణామాలపై విస్తృత అవగాహన కల్పించడం ద్వారా యువతను సరైన మార్గంలో నడిపించవచ్చని పేర్కొన్న ఆమె, మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం (CP Gaush Alam) మాట్లాడుతూ.. ఈ నెల 26న నిర్వహించే అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యాసంస్థల్లో విద్యార్థులకు, ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలకు, గ్రామ సభల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నామని, అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఈ నెల 22 నుంచి విద్యార్థులతో పోస్టర్ డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం, విద్యాసంస్థలను సందర్శించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 26న ర్యాలీలు, గ్రామ సభలు, డ్రగ్ కమిటీ సమావేశాలు నిర్వహించనున్నట్లు వివరించారు. విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో పాన్ షాపులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (డీసీపీఓ) పర్వీన్ మాట్లాడుతూ, “నషా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17 నుంచి చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు.
అనంతరం “నషా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు షర్మిల, జల కుమారి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు నార్కోటిక్స్ ఇన్స్పెక్టర్ రఫిక్ ఖాన్ పోలీస్, ఎక్సైజ్, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Also : గర్భిణీ మృతితో చర్చనీయాంశంగా ప్రభుత్వాసుపత్రులు
Follow Us On: Instagram

