కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న బాలింత కుంజా వనజ మృతి ఘటన (Vanaja Death Case)పై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ రవీందర్ నాయక్ జిల్లాకు విచ్చేసి సమగ్రంగా ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, సంబంధిత వైద్య అధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మృతి చెందిన బాలింతకు అందించిన వైద్య సేవలు, చికిత్స వివరాలు, రిఫరల్ ప్రక్రియ, ఆ సంఘటనకు దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య రికార్డులను నిశితంగా పరిశీలించిన డైరెక్టర్, విధుల నిర్వహణలో ఎలాంటి లోపాలు జరిగాయో తెలుసుకోవడానికి సమగ్ర విచారణ జరపాలని, ఆ విచారణ నివేదికను త్వరితగతిన ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి జాతీయ ఆరోగ్య కార్యక్రమంలోనూ నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం సాధించాలని, పెండింగ్ అంశాలను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్య సంస్థల్లో గర్భిణులకు నాణ్యమైన సేవలు అందించాలని, ముఖ్యంగా హైరిస్క్ గర్భిణులను ముందస్తుగా గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో రిఫరల్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. మాతా-శిశు మరణాల నివారణకు ప్రతి ఆరోగ్య కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేసి, వైద్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరచాలని డాక్టర్ రవీందర్ నాయక్ ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.

