కలం, వెబ్ డెస్క్: దుబాయ్, ఇజ్రాయెల్ మధ్య విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ఫ్లై దుబాయ్ (Flydubai) సంస్థ ప్రకటించింది. బుధవారం జరిగిన భయానక ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇప్పటికే బుక్ చేసిన వారి టికెట్లను రీఫండ్ చేస్తామని.. మళ్లీ ఎప్పుడు ప్రారంభమయ్యేది త్వరలోనే ప్రకటిస్తామని వివరించింది. బుధవారం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ వెళ్తున్న విమానాన్ని స్వయంగా పైలట్ హై జాక్ చేసి కూల్చివేసేందుకు ప్రయత్నించాడు.
వెంటనే గుర్తించిన కో–పైలట్, భారత్కు చెందిన స్మిత్ మచ్ఛర్ అడ్డుకోవడంతో.. ఏకంగా ఎనిమిది సార్లు స్మిత్ మచ్ఛర్ను కాక్ పిట్లోనే పైలట్ కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలతో ఉన్నా కాక్ పిట్ రూం లాక్ కాకుండా స్మిత్ మచ్ఛర్ ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించారు. చివరికి ఆఫ్ డ్యూటీలో ఉన్న మరో ఇద్దరు పైలట్లు వెంటనే విమానాన్ని కంట్రోల్ చేసి.. సౌదీలో సేఫ్ ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులున్నారు.
ఘటనపై ఉన్నత స్థాయి విచారణ..
విమానం హై జాకింగ్ యత్నించిన ఘటనను ఇజ్రాయెల్, సౌదీ అరేబియా ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. దీనిపై ఆయా దేశాల అత్యున్నత దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. ఇప్పటికే.. హై జాకింగ్కు యత్నించిన పైలట్ ఒమన్ దేశస్థుడిగా గుర్తించారు. ఎవరి అండతో అతను హై జాక్ కుట్రకు పాల్పడ్డాడని విచారిస్తున్నారు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్, అంతర్గత దర్యాప్తు సంస్థ షిన్ బెట్ కూడా దీనిపై ప్రత్యేకంగా విచారణ జరుపుతున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి.. వందల మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత్ పైలట్ స్మిత్ మచ్ఛర్ను ప్రపంచ వ్యాప్తంగా అభినందిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

