రంగారెడ్డి జిల్లా చేవెళ్ల(Chevella) పరిసరాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో ప్రజల్లో ఆగ్రహం చెలరేగింది. ఈ నేపథ్యంలో అధికార, విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఒకరినొకరు నిందిస్తున్నాయి. ఈ ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని విపక్షాలు మండిపడుతున్నాయి. “ఈ రహదారిని జాతీయ రహదారిగా మార్చకపోవడం వల్లే తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు పరిస్థితి దయనీయంగానే ఉంది. ప్రతి వర్షాకాలంలో గోతులు, మురుగు నీరు, ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్లే రోడ్డు విస్తరణ జరగలేదు’ అని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నాయి.
అధికారపక్షం మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. “రోడ్డు విస్తరణకు సంబంధించి భూ సేకరణ సమస్యలే ప్రధాన అవరోధం. అనేక గ్రామాల్లో భూమి యజమానులు మార్కెట్ ధరలకు భిన్నంగా పరిహారం కోరుతున్నారు. కేంద్ర రవాణాశాఖతో అనేకసార్లు చర్చలు జరిపాం. కానీ భూసేకరణ అడ్డంకులు తొలగకపోవడంతో ప్రాజెక్టు నిలిచిపోయింది” అని స్పష్టంచేస్తోంది. బీఆర్ఎస్ పార్టీ గతంలో చొరవ తీసుకొని ఉంటే ఇప్పటికే ఈ రహదారి జాతీయరహదారిగా మారేదని వారు అంటున్నారు.
స్థానికుల ఆవేదన
చేవెళ్ల(Chevella) నుంచి మాణిక్యాల వరకు ఉన్న ఈ రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని స్థానికులు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. కానీ అది ఇప్పటికీ అమలు కాలేదనే అసంతృప్తి వారిలో ఉంది. “ప్రతి ఎన్నికల సమయంలో హామీ ఇస్తారు. కానీ పని మొదలయ్యేలోపు ఆగిపోతుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ రోడ్డు పరిస్థితి మారలేదని” వారు వాపోతున్నారు. ప్రాజెక్టు రూపకల్పన, భూసేకరణ, నిధుల కేటాయింపు మూడు దశల్లోనూ సమన్వయం లోపించిందనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ సమస్యను పరిష్కరించకపోవడం, కేంద్రం పాక్షిక నిధులు విడుదల చేయకపోవడం, స్థానిక నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ఈ అంశాన్ని ఉపయోగించుకోవడమే ప్రాజెక్టు నిలిచిపోవడానికి కారణమని వారు చెబుతున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ రోడ్డు విస్తరణ చేసేందుకు పూనుకుంటుందా? అన్నది వేచి చూడాలి.
Read Also: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నిరసన సెగ
Follow Us On : Instagram

