రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రమాద స్థలానికి బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy), తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు సబితా ఇంద్రారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “15 ఏళ్లు మంత్రిగా ఉన్నా ఈ ప్రాంతానికి రోడ్డు సరిగా చేయలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చారు? చూడటానికి వచ్చారా?” అంటూ ఆమెను నిలదీశారు. కొంతమంది తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడ వాగ్వాదం నెలకొంది. సబితా ఇంద్రారెడ్డి అనుచరులూ, స్థానికుల మధ్య తోపులాట కూడా జరిగింది.
అనంతరం సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) మీడియాతో మాట్లాడుతూ “గతంలో ఇది రాష్ట్ర ప్రధాన రహదారి. మా ప్రభుత్వం కాలంలో జాతీయ రహదారిగా మార్చాం. రోడ్డు విస్తరణ పనులు చేపట్టాం. భూసేకరణ పూర్తయ్యాక టెండర్లు కూడా పిలిచాం. కానీ ఎన్నికలు రావడంతో పనులు మొదలుకాలేదు. ఎన్నికలు ముగిసి రెండేళ్లు అయినా ప్రస్తుత ప్రభుత్వం పనులు పూర్తి చేయలేదు. ఈ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలి, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి” అని అన్నారు.
సబితా ఇంద్రారెడ్డి దీర్ఘకాలంగా మంత్రిగా ఉన్నప్పటికీ రహదారి అభివృద్ధిలో నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ ఆమెకు నిరసన తెలిపారు. ఈ ఘటనతో మీర్జాగూడ ప్రమాద స్థలం వద్ద కొంతసేపు ఉద్రిక్తత కొనసాగింది.
Read Also: ఆస్కార్ అవార్డులపై పరేశ్ రావల్ సంచలన వ్యాఖ్యలు
Follow Us On : Instagram

