కలం, నకిరేకల్: నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టులోని (Cheruvugattu Temple) ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయ నూతన ధర్మకర్తల మండలి (పాలకవర్గం) కొలువుదీరింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని నూతన సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆలయ ధర్మకర్తలుగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. ఆలయ పరిపాలనలో పూర్తి పారదర్శకతను పాటిస్తూ, క్షేత్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలన్నారు.
ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం..
చెర్వుగట్టు ఆలయ అభివృద్ధికి నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని విప్ వేముల వీరేశం హామీ ఇచ్చారు. నూతన కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి ఆలయ కీర్తిని మరింత పెంచాలని వేముల వీరేశం ఆశాభావం వ్యక్తం చేశారు. తమపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

