ఆసుపత్రిలో మహిళ మృతి.. డాక్ట‌ర్ల నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని ఆందోళ‌న‌​

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో తీవ్ర విషాదం నెల‌కొంది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స వికటించి ఓ మహిళ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ మరణం సంభవించిందని బాధితురాలి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. నగరంలోని యశోదకృష్ణ ఆసుపత్రిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ​బాధితురాలు బెదరకోట చంద్రకళ గర్భసంచి సమస్యతో బాధపడుతూ చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. ​ఆమెకు గురువారం ఆపరేషన్ చేశారు. అయితే శుక్రవారం సాయంత్రం కల్లా ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించి మృతి చెందారు. ఆపరేషన్ వికటించడం వల్లే చంద్రకళ ప్రాణాలు కోల్పోయారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్యుల అశ్రద్ధే ఆమెను బలి తీసుకుందని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆసుపత్రి ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>