కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ఇసుక మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అక్రమ ఇసుక రవాణా, మైనింగ్ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా సి.సి.ఎస్ ఏసీపీ ఇన్‌చార్జ్ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీతా ఫోర్స్ (Cheetah Force) సిబ్బంది ప్రత్యేక నిఘా నిర్వహిస్తూ ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. మంగళవారం మోర్తాడ్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చీతా ఫోర్స్ బృందం విస్తృత తనిఖీలు నిర్వహించింది. రహస్య సమాచారం మేరకు అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇసుక లారీలను గుర్తించిన పోలీసులు వెంటనే వాటిని అడ్డుకుని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు, రవాణా పత్రాలు లేదా మైనింగ్ సంబంధిత డాక్యుమెంట్లు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు రెండు భారీ వాహనాలను గుర్తించారు. వెంటనే వాహనాలను స్వాధీనం చేసుకుని.. డ్రైవర్లు, సంబంధిత వ్యక్తుల వివరాలను నమోదు చేశారు. పట్టుబడిన లారీలను చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత మోర్తాడ్ ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓలకు అప్పగించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
అక్రమ ఇసుక రవాణా వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం వాటిల్లడమే కాకుండా, నదీ పరివాహక ప్రాంతాలు దెబ్బతిని పర్యావరణ సమతుల్యతకు ముప్పు ఏర్పడుతోందని అధికారులు తెలిపారు. అనధికారికంగా ఇసుక తవ్వకాలు జరగడం వల్ల భూగర్భ జలాల స్థాయి తగ్గిపోవడం, వ్యవసాయ భూములపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ.. జిల్లాలో అక్రమ మైనింగ్, ఇసుక రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి వేళల్లో కూడా ప్రత్యేక బృందాలతో చెక్‌పోస్టులు, ప్రధాన రహదారులు, గ్రామీణ ప్రాంతాల మార్గాల్లో తనిఖీలు మరింత ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా తమ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నట్లు గమనించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీస్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.

