నీట్ రద్దుకు కేంద్రమే బాధ్యత వహించాలి: ఎంపీ చామల

కలం, భువనగిరి: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) రద్దు కావడంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మే 3వ తేదీన జరిగిన నీట్  రద్దు కావడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, కేంద్ర విద్యాశాఖతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం ఈ అంశంపై ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

నీట్ రద్దుతో లక్షలాది విద్యార్థులకు నష్టం

నీట్ రద్దు వల్ల లక్షలాది మంది విద్యార్థులు తమ విలువైన అకడమిక్ ఇయర్‌ను కోల్పోయే ప్రమాదం ఉందని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. “దేశంలో అనవసరమైన అనేక అంశాలపై చర్చలు జరిపే బీజేపీ ప్రభుత్వం, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ తీవ్రమైన అంశంపై ఎందుకు మౌనం వహిస్తోంది? దీనిపై తక్షణమే పార్లమెంట్‌లో చర్చ చేపట్టాలి.” అని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పాలనపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని కిరణ్ రెడ్డి విమర్శించారు. సామాన్యుల అవసరాలు, విద్యార్థుల ఆశయాలు కేంద్ర ప్రభుత్వానికి పట్టవా? అని ఆయన ప్రశ్నించారు.

పేపర్ లీకేజీపై విచారణ జరిపించండి

రాజస్థాన్‌లో జరిగిన నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్రం తక్షణమే విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. “తల్లిదండ్రులు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి, అప్పులు చేసి మరీ కోచింగ్‌ల కోసం డబ్బులు ఖర్చు చేశారు. విద్యార్థులు రాత్రింబవళ్లు శ్రమించి పరీక్ష రాశారు. ఇప్పుడు పరీక్ష రద్దు కావడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.” అని చామల పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని సహించేది లేదని, వారి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని చామల ఈ సందర్భంగా హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>