కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandra babu) ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah)తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పురోగతిపై ఈ సమావేశంలో చర్చించారు. శుక్రవారం ఉదయం నుంచి సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్ ప్రారంభమైంది. ముందుగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు పనుల వేగవంతం, నిధుల విడుదలపై ప్రధానంగా చర్చించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని, గోదావరి వరదల ముందు ప్రధాన పనుల్లో పురోగతి సాధించాలని కోరారు. జల జీవన్ మిషన్ పథకం అమలుపై చర్చలు జరిగాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి అదనంగా రూ.1,000 కోట్లు కేటాయించాలని కోరారు.
ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన సీఎం, పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా నిధులు అందించాలని కోరారు. సాస్కీ కింద రెండో విడత రూ.10,054 కోట్లు మంజూరు చేయాలని, రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు రూ.41 వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలో రాష్ట్రంలోని కీలక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, పోర్టుల అభివృద్ధి, ఆర్థిక సహాయం వంటి అంశాలపై దృష్టి సారించారు.
అనంతరం సీఎం చంద్రబాబు (CM Chandra babu) క్రెడాయ్ (కాన్‌ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా) నేషనల్ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్నారు. సాయంత్రం పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో విడివిడిగా సమావేశాలు జరిపారు. సీఎం వెంట కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, పలువురు ఎంపీలు ఉన్నారు.


