కలం, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి ఉభయగోదావరి, చిత్తూరు, పల్నాడు జిల్లాల్లో తాగునీటి కొరత తీర్చేందుకు ‘అమరజీవి జలధార’ (Amarajeevi Jaladhara ) పథకం ప్రకటించింది. రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టిశ్రీరాములు పేరును ప్రజలు చిరకాలం గుర్తుంచుకొనేలా తాగునీటి పథకానికి ఆయన పేరు పెట్టినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) వెల్లడించారు. ఈ మేరకు పథకానికి సంబంధించిన పోస్టర్ను ఆయన విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు పనులకు శనివారం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ పథకం కోసం రూ.7,910కోట్లు ఖర్చు చేస్తారు. రాబోయే 30 ఏళ్లలో దాదాపు కోటిన్నర మందికి తాగునీరు అందించడం ఈ పథకం లక్ష్యం.


