Mobile Popup Ad
Mobile Popup Ad

రోడ్డు ప్రమాదం కాదు.. భార్య, ప్రియుడి స్కెచ్ చందంపేటలో దారుణం

కలం, చందంపేట: రోడ్డు ప్రమాదంగా భావించిన ఓ వ్యక్తి మృతి కేసులో చందంపేట (Chandampet)  పోలీసులు సంచలన నిజాలను వెలుగులోకి తెచ్చారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను భార్యే, తన ప్రియుడు, అక్కతో కలిసి అత్యంత పక్కా ప్లాన్‌తో హత్య చేసినట్లు నిరూపించారు. ప్రమాద స్థలంలో క్లూస్ వదలకుండా సినిమా ఫక్కీలో నాటకమాడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

సినీ ఫక్కీలో..

అసలేం జరిగిందంటే.. మే 19, 2026 న చందంపేట మండలం బిల్డింగ్ తండాకు చెందిన రమావత్ నర్సింహ (51) తెల్దావరపల్లి గ్రామానికి వెళ్లే రహదారి పక్కన తన బైక్‌తో సహా కిందపడి మృతి చెంది కనిపించాడు. సమాచారం అందుకున్న చందంపేట ఎస్ఐ లోకేష్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతుడి కుమారుడు రమావత్ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తొలుత ఇది సాధారణ రోడ్డు ప్రమాదంగా కనిపించినప్పటికీ, పోలీసులకు కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారాన్ని సేకరించిన పోలీసులు.. మృతుడి రెండో భార్య రమావత్ జ్యోతి కదలికలపై నిఘా పెట్టారు. మే 22, 2026 న డిండి సీఐ బీసన్న ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసి, జ్యోతిని తమదైన శైలిలో విచారించగా అసలు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. తన అక్క లక్ష్మి, ప్రియుడు నేనావత్ రాజుతో కలిసి తానే ఈ హత్య చేసినట్లు ఆమె అంగీకరించింది. పోలీసుల విచారణలో నిందితులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్రమ సంబంధానికి అడ్డు తగులుతున్న నర్సింహను వదిలించుకోవాలని ముగ్గురు నిందితులు ముందస్తు పథకం రచించారు.

మద్యం తాగించి హత్య:

పథకం ప్రకారం నర్సింహను ఎస్‌ఎల్‌బీసీ క్యాంపు నుండి తెల్దేవరపల్లి వెళ్లే దారిలోని కోరుట్ల శివారుకు తీసుకెళ్లారు. అక్కడ అతనికి విపరీతంగా మద్యం తాగించారు. మత్తులోకి జారుకోగానే ముగ్గురూ కలిసి నర్సింహ నోరు, ముక్కు గట్టిగా మూసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. హత్య అనంతరం ఇదొక రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు నర్సింహ శవాన్ని రహదారి పక్కన పడేసి, పక్కనే అతని బైక్‌ను పడేశారు. నర్సింహపై గతంలో దేవరకొండ టౌన్ పీఎస్‌లో రెండు బ్యాటరీల దొంగతనం కేసులు ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని, అతను దొంగతనానికి వెళ్లి వస్తూ ప్రమాదానికి గురయ్యాడని నమ్మించడానికి.. నిందితులు ఘటనా స్థలంలో ఒక ట్రాక్టర్ బ్యాటరీని, పానర్‌ను తెచ్చి పడేశారు. కానీ పోలీసుల చాకచక్యంతో ఈ ప్లాన్ బెడిసికొట్టింది. నిందితుల నుంచి పోలీసులు ఒక మోటార్ సైకిల్, రెండు మొబైల్ ఫోన్లు, సీన్ క్రియేట్ చేయడానికి వాడిన ట్రాక్టర్ బ్యాటరీ,  పానర్, మద్యం తాగించిన రాయల్ స్టాగ్ ఖాళీ క్వార్టర్ సీసా, ఎల్‌ఐసీ ఇన్సూరెన్స్ బాండ్ స్వాధీనం చేసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>