Mobile Popup Ad
Mobile Popup Ad

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

కలం, నల్లగొండ: బ్యాంకుల వద్ద అటెన్షన్ డైవర్షన్ పద్ధతిలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను నల్లగొండ (Nalgonda)  వన్ టౌన్, రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదైన కేవలం 24 గంటల వ్యవధిలోనే సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను పట్టుకోవడం విశేషం. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల ప్రకారం.. జిల్లాలో దొంగతనాల అణిచివేతకు పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే మే 19వ తేదీన నల్లగొండ వన్ టౌన్ పరిధిలోని క్లాక్ టవర్ సమీపంలో ఉన్న యూనియన్ బ్యాంక్ వద్ద ఒక దొంగతనం జరిగింది. తిప్పర్తికి చెందిన గాదె లింగయ్య అనే రైతు తన వరి ధాన్యం అమ్మగా వచ్చిన రూ. 1,50,000 నగదును బ్యాంకు నుండి డ్రా చేసుకున్నాడు.

ఆ డబ్బును ఒక కవర్లో పెట్టి, తన బైక్ ట్యాంక్ కవర్ లో ఉంచాడు. ఆయన ఊరికి వెళ్ళేందుకు బైక్ తీస్తుండగా, ముఠా సభ్యులు తమ మోటార్ సైకిల్‌ను అడ్డం పెట్టారు. మాటల్లో దించి, రైతు దృష్టి మరల్చి ట్యాంక్ కవర్‌లోని రూ.1.50 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన డీఎస్పీ  కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పడ్డాయి.

సీసీటీవీ ఫుటేజ్, నిందితుల ఫోటోలు, వాహనాల నంబర్ల ఆధారంగా గాలింపు చేపట్టారు. మే 21 సాయంత్రం 4 గంటల సమయంలో సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు సైదులు, సైదాబాబు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా.. నకిరేకల్ ఎస్‌బీఐ బ్యాంక్ వద్ద ఒక రైతు నుంచి రూ. 1,40,000 కొట్టేసి హెచ్ఎఫ్ డీలక్స్ బైక్‌పై పారిపోతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అనుమానంతో పట్టుకున్నారు. విచారణలో వారు తాము చేసిన నేరాలను అంగీకరించారు. ఈ కేసులో ఏ1 రాహుల్ ప్రస్తుతం పరారీలో ఉండగా, మహారాష్ట్రలోని సోలాపూర్ చెందిన ఏ2 కేశవ తేజ దొక్వల(20), మరో మైనర్ బాలుడు (13) ఉన్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ ముఠా ఏర్పడింది. తెలంగాణ వ్యాప్తంగా మక్తల్, మరికల్, నల్లగొండ వన్ టౌన్, ఖమ్మం త్రీ టౌన్, నక్రేకల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో తామే దొంగతనాలు చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. వారి నుంచి నల్లగొండ, నకిరేకల్ చోరీలకు సంబంధించిన రూ. 2,20,000/- నగదు, హెచ్ఎఫ్ డీలక్స్ బైక్, ఒక వీవో సెల్ ఫోన్, బ్యాంక్ పాస్ బుక్కులు, దృష్టి మరల్చే వస్తువులను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>