కేటీఆర్, హరీష్ రావు మాట‌ల‌కు ప్ర‌భుత్వం ప‌డిపోదు: ఎంపీ చామల

కలం, నల్లగొండ బ్యూరో: కేటీఆర్, హరీష్ రావు రోజూ ఎన్ని మాట్లాడినా ప్రజలు పట్టించుకోరని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar) అన్నారు. కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao) మాట‌ల‌కు ప్రభుత్వం పడిపోదని, అంతిమంగా న్యాయ నిర్ణేతలు తెలంగాణ ప్రజలేన‌ని చెప్పారు. నమ్మి గెలిపించిన ప్రజల కోసం పని చేయాల్సిన బాధ్య‌త త‌మ‌పై ఉందన్నారు. కేటీఆర్, హరీష్ రావు, బీజేపీ నాయకులు ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఓడిపోయినంత మాత్రాన దూరంగా ఉండాల్సిన అవసరం లేదని, జిల్లా సభలు, గ్రామ సభల్లో పాల్గొనాలని కోరారు. కేటీఆర్, హరీష్ రావు, బీజేపీ కలిసి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం బంద్ చేయాలని, ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు.

రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధితో పాటు ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దానిపై ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక ద్వారా తెలుసుకుంటామ‌ని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని, కానీ హరీష్ రావు, కేటీఆర్ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లవద్దని భావిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మదిలో ఉండకూడదనేది కేటీఆర్, హరీష్ రావు కుట్ర అని పేర్కొన్నారు. అధికారం కోల్పోతామని ఎన్నడూ కేటీఆర్, హరీష్ రావు అనుకోలేదని, అధికారం మాకు శాశ్వతంగా ఉంటుందనే తరహాలో వారి ఆలోచన ఉండేదని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ప్రగతి భవన్ కట్టి ప్రగతి లేని పాలన ప్రజలకు అందించారని, పదేళ్ల‌లో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు.

ఫామ్ హౌస్‌లో వాళ్ల‌ కుటుంబసభ్యులు మాట్లాడుకోవడం తప్ప ఏనాడూ మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడ‌లేద‌న్నారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల పాలు చేసిందని, చీకటి జీవోల ద్వారా ఎన్ని అప్పులు చేశారో తెలంగాణ ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయే నాటికి జీత భత్యాలు, పెన్షన్లు బకాయిలు పెట్టి వెళ్లారని, తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రమిస్తున్నారని ఎంపీ చామల (Chamala Kiran Kumar) వివరించారు.

 Read Also: నేడు సీఎం రేవంత్‌ ఎదుట లొంగిపోనున్న మావోయిస్టులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>