కలం, నకిరేకల్ : రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై గళమెత్తి, శాంతియుతంగా ‘చలో సచివాలయం’ కార్యక్రమానికి బయలుదేరిన విద్యార్థి–యువజన నాయకులను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని వామపక్ష సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్‌లో చేపట్టిన ‘చలో సచివాలయం’ కార్యక్రమానికి నల్లగొండ (Nalgonda) నుంచి బయలుదేరుతున్న నేతలను టూ టౌన్ పోలీసులు తెల్లవారుజామునే ముందస్తు అరెస్టులు చేశారు.
ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్, పీవైఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇందూరు సాగర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు గాదేపాక సాయితేజ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా తమ హక్కుల కోసం నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం ఉక్కుపాదంతో కాలరాయడం అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు సంబంధించిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు. కాలేజీల్లో ఫీజులు చెల్లించలేక ఎంతోమంది విద్యార్థులు చదువులను మధ్యలోనే ఆపేసే ప్రమాదకర పరిస్థితి నెలకొందన్నారు. సర్టిఫికెట్లు ఇవ్వక ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు పేద విద్యార్థులు దూరమవుతున్నారని, విద్య హక్కును కాపాడాల్సిన ప్రభుత్వమే విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం భావ్యం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ, నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీల ప్రకారం ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు.

