రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు: చాడ వెంకట రెడ్డి

కలం, కరీంనగర్ బ్యూరో: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారు పండించిన వరి,మొక్కజొన్న పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి మిల్లర్ల వద్దకు చేర్చాలని సిపిఐ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి (Chada Venkata Reddy) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధ వారం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం నాగెల్లి లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. వరి కోతల సమయంలో రైతుల కష్టాలు వర్ణానతీతమని ఎండాకాలంలో పంటలు సాగు నీరు అంది అందక పంటలు ఎండిపోయి తక్కువ దిగుబడి రావడంతో నష్టాల్లో కూరుకుపోయి ఉంటే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొన్నప్పటికీ వాటిని గతంలో మాదిరిగా కాకుండా రైస్ మిల్లులకు రైతులే తీసుకువెళ్లి వాటిని అప్పగించే విధానం మూలంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,మిల్లర్లు వాటిని అన్ లోడ్ చేసుకోకుండా హమాలీ కొరత సాకు చూపుతూ వారిని ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు.

ఆన్ లైన్ సిస్టమ్ తెచ్చి మిల్లులను అలాట్ చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, పౌర సరఫరాల శాఖ ద్వారా కానీ, సహకార సంఘాల ద్వారా కానీ కొనుగోలు చేసి మిల్లులకు పంపడం వల్ల రైతులకు మేలు కలుగుతుందన్నారు. ఆన్ లైన్ సిస్టమ్ వల్ల రైతుల బ‌తుకులు బజారుపాలు కావడమే తప్ప వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. రైతులకు నష్టం కలిగించే చర్యలకు ప్రభుత్వం పూనుకోవద్దని తక్షణమే పౌర సరఫరాల శాఖ మంత్రి, అధికారులు స్పందించాలని కోరారు. ఇది కేవలం ఒక ప్రాంతం సమస్య కాదని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్య అని, వరి ఒక్కటే కాదు మక్కల కొనుగోలు చేయకపోతే కూడా ఆ రైతుల పరిస్థితి కూడా అన్నమో రామచంద్ర అనే సామెతలాగా ఉంటుందని అన్నారు. అకాల వర్షాలు పడితే వడ్లు తడిసిపోయి రైతులకు నష్టం కలుగుతుందని అలా జరిగితే ఇక వారికి ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు. రైతుల బ్రతుకులు చితికి పోకుండా ఉండాలంటే,అప్పులు తెచ్చుకొని పండించిన పంటలను కొనుగోలు చేయడానికి తక్షణమే ప్రభుత్వం,యంత్రాంగం పూనుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో రైతుల పక్షాన నిలబడి ధర్నాలు,నిరసనలు తెలియజేస్తామని చాడ వెంకటరెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి,జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్,గూడెం లక్ష్మి, నాగెల్లి లక్ష్మారెడ్డి,టేకుమల్ల సమ్మయ్య, బోయిని తిరుపతి,న్యాలపట్ల రాజు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>