హైదరాబాద్ మెట్రో రైలు ఇక సర్కారుదే.. ఎల్‌అండ్‌టీతో కీలక ఒప్పందం

కలం, వెబ్ డెస్క్: ఇప్పటివ‌ర‌కు ఎల్ అండ్ టీ ఆధీనంలో ఉన్న మెట్రో రైలును (Hyderabad Metro) తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. హైద‌రాబాద్ మెట్రో రైలు ఫేజ్‌-Iను స్వాధీనం చేసుకోవాల‌ని తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) గ‌తంలోనే నిర్ణయించింది. ఈ మేర‌కు ఎల్ అండ్ టీతో కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు నిర్వహించింది. ఈ నేప‌థ్యంలో మెట్రో రైల్ ఛైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి కె. రామకృష్ణారావు, మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ అండ్ టీతో ప్రతినిధులు బుధ‌వారం స‌చివాల‌యంలో స‌మావేశ‌మ‌య్యారు. స‌మావేశంలో మెట్రో రైలు సంస్థలతో షేర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. సంస్థకున్న వంద శాతం షేర్లను రూ.1,461.47 కోట్ల ఈక్విటీ విలువకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఒప్పందంపై మెట్రో రైలు ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఎల్ అండ్ టీ త‌ర‌ఫున‌ డి.కె.సేన్, కేవీబీ రెడ్డి సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఎల్ అండ్ టీ హామీతో LTMRHL పై ఉన్న రూ. 13,538.53 కోట్ల అప్పును (2026, ఏప్రిల్ 30వ తేదీ నాటికి) తెలంగాణ ప్రభుత్వం హామీతో రీఫైనాన్స్ చేస్తారు. ఈ లావాదేవీకి ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా ఏడీబీఐ క్యాపిటల్‌ వ్యవహరించగా, లీగల్ అడ్వైజరీ సేవలను Saraf & Partners సంస్థ అందించింది.

ప్రయాణికుల‌ సేవలే లక్ష్యంగా..

మెట్రో రైలు లిమిటేడ్ సంస్థ 2017 నవంబర్ నుంచి మూడు కారిడార్లలో మొత్తం 69 కిలోమీటర్ల నెట్‌వర్క్‌తో మెట్రో రైల్ ఫేజ్–Iను నిర్వహిస్తోంది. మెట్రోలో ప్రస్తుతం రోజుకు సుమారు 4.50 లక్షల మంది ప్రయాణికులు రాక‌పోక‌లు సాగిస్తున్నారు. మెట్రో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 86 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయి. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్–Iను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవ‌డంతో ఫేజ్–I, ప్రతిపాదిత ఫేజ్–II నెట్‌వర్క్ రూప‌క‌ల్పన‌, ప‌నులు, ప్రణాళిక‌, అమలు, సేవల అందజేతలో సమన్వయం సాధ్యమవుతుంది. భ‌విష్యత్‌లోనూ హైదరాబాద్ ప్రయాణికులకు అనుకూలమైన మెట్రో రైలు నెట్‌వర్క్ ఏర్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

సీఎంతో ఎల్ అండ్ టీ సీఎండీ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ భేటీ

ఎల్ అండ్ టీ నుంచి మెట్రో రైలును స్వాధీనం చేసుకునే ఒప్పందానికి ముందుగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) ఎల్ అండ్ టీ సీఎండీ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ భేటీ మ‌ర్యాద‌పూర్వకంగా క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై వారిద్దరి మ‌ధ్య చ‌ర్చలు జరిగాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>