కలం, వెబ్ డెస్క్ : గిగ్ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 10 నిమిషాల ఆన్ లైన్ డెలివరీ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు (10 Minute Delivery Ban) ప్రకటించింది. కొన్ని వారాలుగా గిగ్ వర్కర్లు డిమాండ్ చేస్తున్న తరుణంలో కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ (Mansukh Mandaviya) ఈ నిర్ణయం తీసుకున్నారు. పది నిమిషాల డెలివరీ యాడ్స్ ఇవ్వకూడదని క్విక్ కామర్స్ సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో అధికారులతో కేంద్రమంత్రి చర్చలు జరిపారు. డెలివరీ కార్మికుల భద్రత దృష్ట్యా కఠినమైన డెలివరీ సమయ పరిమితులను తగ్గించాలని వారికి కేంద్రమంత్రి సూచించారు.
మన్‌సుఖ్ మాండవీయ సూచనలతో డెలివరీ భాగస్వాములు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల నుంచి 10 నిమిషాల డెలివరీ నిబంధన తొలగిస్తున్నట్లు వెల్లడించాయి. బ్లింకిట్ ఇప్పటికే కేంద్రమంత్రి ఆదేశాలతో ఈ రూల్ ను తొలగించింది. రాబోయే రోజుల్లో ఇతర అగ్రిగేటర్లు దీనిని అనుసరించనున్నట్లు తెలిసింది. కాగా, 10 నిమిషాల డెలివరీ నిబంధనను తొలగించాలని, మునుపటి చెల్లింపు నిర్మాణాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ గిగ్ వర్కర్స్ యూనియన్లు దేశవ్యాప్తంగా సమ్మె చేసిన విషయం తెలిసిందే.

Read Also: ‘జన నాయగన్’ను అడ్డుకోవడం తమిళ సంస్కృతిపై దాడే: రాహుల్ గాంధీ
Follow Us On : WhatsApp


