కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శలు గుప్పించారు. ఇది మోసం, దగా, ప్రజా వంచన బడ్జెట్ అని మండిపడ్డారు. ఆదాయం పెంచుకోవడం చేతకాక, అప్పుల కోసం అర్రులు చాచే బడ్జెట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆరోపించారు. మరో రూ. లక్ష కోట్లు అదనంగా అప్పు భారం మోపాలని చూడటం సిగ్గుచేటు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బడ్టెట్ లో రైతులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని బండి సంజయ్ తెలిపారు. ఆరు గ్యారెంటీలకు (Six Guarantees) పాడె కట్టినట్లుగా బడ్జెట్ ద్వారా వెల్లడైందన్నారు. రైతు భరోసా పైసలు ఎగ్గొట్టారని, కౌలు రైతులు, వ్యవసాయ కూలీల నోట్లో మట్టి కొట్టారని ఆరోపించారు. తులం బంగారం తుస్.. రూ.2500లు నిల్తో మహిళలను మళ్లీ మోసం చేశారని విమర్శించారు. రూ.4 వేల పెన్షన్ పెంపు ఊసే లేకుండా అవ్వాతాతల నోట్లో మట్టి కొట్టారని వ్యాఖ్యానించారు. బడ్జెట్లో (Telangana Budget) నిరుద్యోగ భృతి అంశమే లేదన్నారు. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు కదా.. రూపాయి బిళ్ల కేటాయించలేదని మండిపడ్డారు. 56 శాతం ఉన్న బీసీ జనాభాకు బడ్జెట్లో 4 శాతం కేటాయింపులా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీలకు సైతం బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం చేశారన్న ఆయన.. మైనారిటీలకు గతేడాదికంటే ఎక్కువ నిధులు కేటాయించడం విడ్డూరమని తెలిపారు.
రెండేళ్లలో దిగిపోయే ప్రభుత్వమే కదా అని ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తున్నారని బండి సంజయ్ (Bandi Sanjay ) ఫైర్ అయ్యారు. దావోస్, గ్లోబల్ సమ్మిట్ పేరుతో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆర్థిక మంత్రి చెప్పడం అబద్ధమన్న బండి సంజయ్.. ఆ వివరాలు వెల్లడించే దమ్ముందా? అని సవాల్ విసిరారు. బీజేపీ అధికారంలోకి వస్తే గత బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ చేసిన అప్పుల బాగోతంపై విచారణ చేస్తామని హెచ్చరించారు.
Read Also: చిన్నారి కోరిక తీర్చిన విజయ్-రష్మిక జంట
Follow Us On: Instagram

