కలం, వెబ్ డెస్క్ : నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండలతో పాటు వడగాల్పుల భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లటి కబురు అందించింది. నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) ముందస్తు రాకకు అనుకూల వాతావరణం ఉందని వెల్లడించింది. మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్‌ను తాకనున్నాయని అంచనా వేసింది. దీంతో ఈ నెలాఖరులోపే నైరుతి రుతు పవనాలు కేరళలోకి ప్రవేశించనున్నాయని పేర్కొంది.
అయితే సాధారణంగా నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు మే 15 నాటికి ప్రవేశిస్తాయి. మే 20 నాటికి అండమాన్ సముద్రం అంతటా విస్తరిస్తాయి. ఈ కాలక్రమానికి అనుగుణంగానే ఈ ఏడాది రుతుపవనాల రాక కూడా ఉండబోతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే గతేడాది నైరుతి రుతుపవానాలు సాధారణ షెడ్యూల్ కంటే ముందుగానే ప్రవేశించాయి. మే 13 నాటికే దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవులకు చేరాయి. తాజా నైరుతి రుతుపవనాల వల్ల మే 16,17 తేదీల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్ (జూన్ నుండి సెప్టెంబర్ వరకు) సాధారణం కంటే తక్కువగా ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

