కరీంనగర్ డెయిరీ భూములపై రైతుల సమరం

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్‌లో పాడి రైతులు కదం తొక్కారు. కరీంనగర్ మిల్క్ డెయిరీకి (Karimnagar Dairy) సంబంధించిన భూములను తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ పేరుతో నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం భారీ ఆందోళన చేపట్టారు. భూభారతి పోర్టల్‌లో డెయిరీ భూముల రికార్డులు మారిపోవడంతో వివాదం చెలరేగింది. కరీంనగర్ డెయిరీ భూములను ఖాళీ చేయాలని తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ ఉత్తర్వులు జారీ చేయడంతో కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ యాజమాన్యం, ఉమ్మడి జిల్లా పాడి రైతులు పెద్ద సంఖ్యలో కరీంనగర్‌కు తరలివచ్చారు. ధరణిలో కరీంనగర్ డెయిరీ పేరుతో ఉన్న భూములను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భూభారతిలో తెలంగాణ ఫెడరేషన్ పేరుతో మార్చారని రైతులు ఆరోపించారు. వెంటనే రికార్డులను తిరిగి డెయిరీ పేరుతో నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

వేలాది మంది రైతులతో భారీ ర్యాలీ

పద్మనగర్‌లోని కరీంనగర్ డెయిరీ నుంచి ప్లకార్డులు, నినాదాలతో పాడి రైతులు ర్యాలీగా కలెక్టరేట్‌కు తరలివెళ్లారు. సుమారు 4 వేల మంది రైతులు నిరసనలో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కలెక్టరేట్‌కు చేరుకున్న సుమారు 2 వేల మంది పాడి రైతులు శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. అనంతరం కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో ప్రతినిధులు కలెక్టర్ చిత్రా మిశ్రాను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

భూముల రికార్డుల మార్పుపై అభ్యంతరం

సర్వే నంబర్ 194లోని మొత్తం భూమిలో కరీంనగర్ డెయిరీకి కేటాయించిన 22.18 ఎకరాలలో 11.32 ఎకరాలను కో-ఆపరేటివ్ ఫెడరేషన్ పేరుతో నమోదు చేయడం అన్యాయమని రైతులు పేర్కొన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే రెవెన్యూ రికార్డులను మార్చారని ఆరోపించారు. డెయిరీ భవనాలు తమవేనంటూ వాటిని ఖాళీ చేయాలని ఫెడరేషన్ ఎండీ ఆదేశాలు జారీ చేయడం వల్ల పాడి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ డెయిరీపై ఆధారపడి లక్ష మంది పాడి రైతులు జీవిస్తున్నారని తెలిపారు.

రైతులకు న్యాయం చేయాలి: చల్మెడ

అనంతరం డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్ రావు మాట్లాడుతూ కరీంనగర్ డెయిరీని నమ్ముకుని లక్ష మంది పాడి రైతులు జీవిస్తున్నారని అన్నారు. వారికి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. లాభాల్లో నడుస్తున్న సంస్థ విషయంలో ప్రభుత్వం ఇలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. భూభారతి పోర్టల్‌లో తెలంగాణ ఫెడరేషన్ పేరుతో మార్చిన భూములను వెంటనే కరీంనగర్ డెయిరీ పేరుతో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పాడి రైతులకు పెండింగ్‌లో ఉన్న లీటర్‌కు రూ.4 ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రతి పాడి రైతుకు 50 శాతం సబ్సిడీపై రెండు పశువులను ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. తాము శాశ్వతంగా ఉండకపోవచ్చని, అయితే పాడి రైతులు తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఐక్యంగా పోరాడాలని చల్మెడ రాజేశ్వర్ రావు పిలుపునిచ్చారు. న్యాయం జరిగే వరకు కలిసికట్టుగా భవిష్యత్ కార్యాచరణతో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>