కలం, వెబ్‌డెస్క్: ఏపీ విద్యా వ్యవస్థ అభివృద్ధికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వ పాఠశాలలు (AP Govt Schools), జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఏపీ స్కూల్ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ సొసైటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మన బడి-మన భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ఈ నూతన సొసైటీని ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరతను తీర్చడానికి ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తున్నా, ఇంకా ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత, ఎన్ఆర్ఐలు, దాతలు, పూర్వ విద్యార్థుల నుంచి విరాళాలను సేకరించి, వాటిని పారదర్శకంగా నిర్వహించడం ఈ సొసైటీ ప్రధాన ఉద్దేశం.
ఈ సొసైటీకి పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి చైర్మన్‌గా, స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కమిషనర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. దాతల నుంచి నిధులు సమీకరించేందుకు ప్రత్యేకంగా డోనర్స్ పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. తద్వారా సేకరించిన విరాళాలకు వంద శాతం ఆదాయ పన్ను మినహాయింపు పొందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నిధులతో రాష్ట్రంలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఆధునిక వసతులు కల్పించి, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం ప్రత్యేకంగా రెండు బ్యాంక్ ఖాతాలను కూడా నిర్వహించనుంది.
Read Also: పవర్ హౌస్ జిల్లాలో అంధకారం.. భద్రాద్రిలో కరెంటు కష్టాలు
Follow Us On: Sharechat

