కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు జిల్లా కేంద్రంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న వేడుకలకు సీటింగ్ ఏర్పాట్లు, ఇతర అన్ని కార్యక్రమాలు ప్రోటోకాల్‌కు అనుగుణంగా పక్కాగా నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లు, నిర్వహణపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం సాయంత్రం జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేడుకల్లో ప్రతిబింబించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన పెంచే విధంగా ప్రత్యేక ప్రదర్శనలు, సమాచార కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.
అన్ని శాఖల స్టాల్స్ ఏర్పాటు..
ఆవిర్భావ దినోత్సవాల్లో ఫైర్ శాఖ, సఖి, మహిళా శిశు సంక్షేమం, విద్యా, మెప్మా, వ్యవసాయ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ, విద్యుత్ శాఖల ప్రత్యేక థీమ్ ఆధారిత స్టాల్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మండలాలు, గ్రామ స్థాయిలో కూడా ఘనంగా నిర్వహించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో మహేశ్వర్, డీసీపీ వెంకటరమణ, జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, డీపీవో జగదీశ్వర్, మెప్మా పీడీ స్వరూప రాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీకాంత్ చక్రవర్తి, డీఆర్డీవో గీత, వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, బీసీడీవో అనిల్ ప్రకాష్, పలువురు జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

