నీట్ పేపర్ లీకేజ్ కేసు.. సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు

కలం, వెబ్ డెస్క్:  నీట్ (NEET UG 2026) పేపర్ లీకేజ్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దాదాపుగా 22 లక్షల మందికిపైగా విద్యార్థులు ప్రభావితమయ్యారు. లీకేజ్ ఘటన నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మంగళవారం పరీక్షను రద్దు చేసింది. లీకేజ్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించగా.. అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ కుంభకోణం మహారాష్ట్రలోని నాసిక్ కేంద్రంగా ప్రారంభమైనట్లు సమాచారం. నాసిక్‌కు చెందిన శుభం ఖైర్నార్ అనే విద్యార్థిని ప్రశ్నాపత్రం లీక్ కేసులో కీలక సూత్రదారిగా గుర్తించారు. పుణేకు చెందిన ఓ వ్యక్తి నుంచి లీక్ అయిన పేపర్‌ను రూ.10 లక్షలకు కొనుగోలు చేసి, హర్యానాలోని ఓ కొనుగోలుదారుకు రూ.15 లక్షలకు విక్రయించినట్లు సీబీఐ (సీబీఐ) అధికారులు తెలిపారు. ఈ లావాదేవీల ద్వారా అతడు రూ.5 లక్షల లాభం పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.

టెలిగ్రామ్ ద్వారా దేశం మొత్తం వ్యాప్తి

లీకైన ప్రశ్నాపత్రం టెలిగ్రామ్ యాప్ ద్వారా వివిధ రాష్ట్రాలకు వ్యాపించినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. హర్యానాలోని గురుగ్రామ్, రాజస్థాన్‌లోని జైపూర్, సికర్ వంటి కోచింగ్ హబ్‌లు, అలాగే జమ్మూ కాశ్మీర్, బిహార్, కేరళ రాష్ట్రాలకు కూడా పేపర్ చేరినట్లు సమాచారం.

ఎవరీ శుభం ఖైర్నార్?

శుభం ఖైర్నార్ (30) నాసిక్‌లోని ఇంద్రనగర్ ప్రాంతానికి చెందినవాడు. అతడు బాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (బీఏఎంఎస్) విద్యార్థి అని అధికారులు తెలిపారు.  అతడు ఓ గుడికి వెళ్తుండగా సీబీఐ అదుపులోకి తీసుకుంది. గుర్తింపు తప్పించుకునేందుకు తన రూపాన్ని మార్చుకున్నప్పటికీ, పాత ఫోటోలు సాంకేతిక సర్వైలెన్స్ ఆధారంగా అతడిని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. తన కుమారుడు శుభం ఖైర్నార్‌పై వచ్చిన ఆరోపణలను అతని తండ్రి మధుకర్ ఖైర్నార్ ఖండించారు. తన కుమారుడికి ఈ లీక్ రాకెట్‌తో సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ పేరు విచారణలో వచ్చినందున నిజానిజాలు తేల్చేందుకు సమగ్ర దర్యాప్తు జరగాలని ఆయన కోరారు.

గెస్ పేపర్ పేరుతో పీడీఎఫ్ వైరల్

దర్యాప్తులో భాగంగా, 45 గంటల ముందే పేపర్ సర్క్యులేట్ అయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం రాజస్థాన్‌లోని ఓ కోచింగ్ సెంటర్ కేంద్రంగా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. కేరళలో చదువుతున్న విద్యార్థి ఒకరు “గెస్ పేపర్” పేరుతో పీడీఎఫ్ ఫైల్‌ను తన తండ్రికి పంపిన ఘటనతో అసలు విషయం బయటపడినట్లు చెబుతున్నారు. ఆ తండ్రి ఆ పేపర్‌ను హాస్టల్‌లో ఉన్న విద్యార్థులకు షేర్ చేయడానికి ప్రయత్నించగా, అప్పటికే వారు పరీక్ష కేంద్రాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. పరీక్ష అనంతరం ఆ పేపర్‌ను రసాయన శాస్త్రం, జీవశాస్త్ర ఉపాధ్యాయులు పరిశీలించగా, 108 కెమిస్ట్రీ ప్రశ్నల్లో 45 ప్రశ్నలు, 204 బయాలజీ ప్రశ్నల్లో 90 ప్రశ్నలు అసలు ప్రశ్నాపత్రంతో సరిపోలినట్లు గుర్తించారు. కొన్ని కోచింగ్ సెంటర్లు ఈ “గెస్ పేపర్ల” ఆధారంగా విద్యార్థులను సిద్ధం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరికి PDF రూపంలో, మరికొందరికి ప్రింటెడ్ కాపీల రూపంలో ఈ లీక్ పేపర్ అందినట్లు తెలుస్తోంది.

ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదా?

ప్రారంభంలో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని సమాచారం. అనంతరం ఈ విషయం NTAకు చేరగా, వారు ఇంటెలిజెన్స్ బ్యూరో (IB)కు తెలియజేశారు. IB సూచనల మేరకు రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) దర్యాప్తు ప్రారంభించింది. మే 8న SOG బృందం సికర్‌లో కొందరిని గుర్తించి అరెస్టు చేయగా, దర్యాప్తు హర్యానా మరియు నాసిక్ వరకు విస్తరించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు రాజస్థాన్‌లో 15 మందిని అరెస్టు చేశారు. వీరిలో ప్రధాన సూత్రధారి మనీష్ యాదవ్, రాకేష్ మంద్వారియా కూడా ఉన్నారు. రాకేష్ మంద్వారియాకు సికర్‌లోని ఓ కన్సల్టెన్సీ కేంద్రంతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

Read Also: ఉదయనిధి హిందువులకు క్షమాపణ చెప్పాలి : భానుప్రకాష్ రెడ్డి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>